Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..
Chess Player Gukesh: ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. చెన్నైకి చెందిన ఈ 17 ఏళ్ల ప్లేయర్ క్యాండిడేట్స్ గెలిచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచాడు.
Chess Player Gukesh: చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ 17 ఏళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచాడు. దీంతో అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి టీనేజర్ అతడే కావడం గమనార్హం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ గెలిచిన రెండో భారతీయుడిగా కూడా గుకేశ్ నిలిచాడు.
గుకేశ్ కొత్త చరిత్ర
చెన్నైకి చెందిన దొమ్మరాజు గుకేశ్.. ఈ క్యాండిడేట్స్ టోర్నీలో 14 రౌండ్లలో 9 పాయింట్లతో తొలిస్థానంలో నిలవడం విశేషం. ఈ టైటిల్ విజయంతో ఈ ఏడాది జరగబోయే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కోసం డింగ్ లైరెన్ తో అతడు తలపడనున్నాడు. క్యాండిడేట్స్ చివరి రౌండ్లో జపాన్ ప్లేయర్ హిరాకు నకమురాతో గేమ్ డ్రా చేసుకున్న గుకేశ్.. టోర్నీ విజేతగా నిలిచాడు.
అప్పటికే టాప్ లో ఉన్న గుకేశ్.. కేవలం డ్రా చేసుకున్నా సరిపోతుందనే పరిస్థితుల్లో అతడు అదే చేశాడు. మరోవైపు నకమురాతోపాటు ఫ్యాబియానో కరువానా, ఇయాన్ నెపోమ్నియాచ్చిలాంటి ప్లేయర్స్ చివరి రౌండ్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగారు. అయితే చివరి రెండ్లో వీళ్ల గేమ్స్ డ్రాగా ముగియడంతో గుకేశ్ కు టైటిల్ ఖాయమైంది.
ఏమాత్రం అంచనాలు లేకుండా..
తొలిసారి క్యాండిడేట్స్ లో పాల్గొన్న గుకేశ్ పై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఈ టోర్నీలో వరల్డ్ టాప్ 3లోని ఇద్దరు ప్లేయర్స్ తోపాటు రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచిన ప్లేయర్స్ పాల్గొన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గత మూడు వారాలుగా గుకేశ్ తన విజయ పరంపరను కొనసాగించాడు.
గుకేశ్ విజయంపై వరల్డ్ నంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్ స్పందించాడు. తాను కూడా చేయలేని పనిని గుకేశ్ చేశాడని, చాలా మందిలాగే అతడు ఈ టోర్నీ గెలుస్తాడని తాను భావించలేదని అన్నాడు. ఈ టోర్నీలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ పాల్గొన్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు కార్ల్‌సన్ మాట్లాడుతూ ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా తాను షాక్‌కు గురవుతానని అనడం గమనార్హం.
చివరిదైన 14వ రౌండ్లో నకమురాతో 71 ఎత్తుల తర్వాత గుకేశ్ డ్రా చేసుకున్నాడు. అంత వరకూ విజయం కోసం ప్రయత్నించిన నకమురా కూడా చివరికి డ్రాకు అంగీకరించాడు. మరోవైపు కారువానా, నెపోమ్నియాచ్చి గేమ్ కూడా 109 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. దీంతో గుకేశ్ విజేతగా నిలిచాడు.
గర్వంగా ఉందన్న ఆనంద్
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ గెలిచిన రెండో భారత ప్లేయర్ గుకేశ్. అయితే అతని విజయంపై ఆనంద్ కూడా స్పందించాడు. సోమవారం (ఏప్రిల్ 22) ఉదయాన్నే అతడు ట్వీట్ చేశాడు. గుకేశ్ కు శుభాకాంక్షలు చెప్పాడు.
“యంగెస్ట్ ఛాలెంజర్ గా నిలిచినందుకు గుకేశ్ కు శుభాకాంక్షలు. నువ్వు సాధించిన విజయం చూసి గర్విస్తున్నాం. కఠినమైన పరిస్థితుల్లో నువ్వు వ్యవహరించిన తీరు, ఆడిన తీరు చూసి గర్వపడుతున్నా” అని ఆనంద్ ట్వీట్ చేశాడు.
టాపిక్