Chess Player Gukesh: చెస్‌లో కొత్త కింగ్.. 36 ఏళ్ల ఆనంద్ ఆధిపత్యానికి గుకేష్ చెక్-chess player gukesh is now highest ranked in india surpassing anand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Chess Player Gukesh: చెస్‌లో కొత్త కింగ్.. 36 ఏళ్ల ఆనంద్ ఆధిపత్యానికి గుకేష్ చెక్

Chess Player Gukesh: చెస్‌లో కొత్త కింగ్.. 36 ఏళ్ల ఆనంద్ ఆధిపత్యానికి గుకేష్ చెక్

Hari Prasad S HT Telugu
Aug 04, 2023 09:21 AM IST

Chess Player Gukesh: చెస్‌లో కొత్త కింగ్ వచ్చాడు. 36 ఏళ్లుగా ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ ప్లేయర్ గా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ ఆధిపత్యానికి గుకేష్ చెక్ పెట్టాడు.

చెస్ ప్లేయర్ గుకేష్
చెస్ ప్లేయర్ గుకేష్

Chess Player Gukesh: ఇండియాలో చెస్ అంటే ఆనంద్.. ఆనంద్ అంటే చెస్. మూడున్నర దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. నిజానికి 1987 నుంచి అంటే 36 ఏళ్లుగా ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువు ఆనంద్ నే మించిపోయి ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన చెస్ ప్లేయర్ గా నిలిచాడు.

గుకేష్.. నయా కింగ్

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఓ ఇండియన్ ప్లేయర్.. విశ్వనాథన్ ఆనంద్ ను మించిన రేటింగ్ సాధించాడు. తాజాగా గుకేష్.. వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్‌బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి.

దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది.

"గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది.

మూడున్నర దశాబ్దాల ఆనంద్ ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టిన గుకేష్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసల వర్షం కురిపించారు. అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా నువ్వు ఎంతోమంది యువ ప్లేయర్స్ కు ఆదర్శంగా నిలుస్తావని అన్నారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచీ ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్ గా అతడే ఉన్నాడు.

ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ తన లీడ్ కొనసాగిస్తే ఆనంద్ ను మించిన తొలి ప్లేయర్ అవుతాడు.

WhatsApp channel

టాపిక్