Chess player Divya Deshmukh: నా ఆట తప్ప అన్నీ చూశారు: ప్రేక్షకులపై చెస్ ప్లేయర్ దివ్య సీరియస్
Chess player Divya Deshmukh: యంగ్ ఇండియన్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ ప్రేక్షకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు తన ఆట తప్ప అన్నీ చూశారంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Chess player Divya Deshmukh: చెస్‌లో మహిళల పట్ల వివక్ష, చిన్నచూపు గురించి భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ స్పందించింది. 18 ఏళ్ల ఈ ప్లేయర్ ఈ మధ్యే నెదర్లాండ్స్ లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసింది.
అయితే ఈ టోర్నీలో మహిళా ప్లేయర్స్ ను ప్రేక్షకులు ఎలా చిన్న చూపు చూశారో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని తాను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నట్లు తెలిపింది.
దివ్య దేశ్‌ముఖ్ సీరియస్
ఈ టోర్నీలో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి ఇన్‌స్టా పోస్టులో దివ్య దేశ్‌ముఖ్ వివరించింది. "చాలా రోజులుగా దీనిపై మాట్లాడాలనుకుంటున్నాను కానీ టోర్నీ ముగిసే వరకూ వేచి చూశాను. చెస్ లో మహిళా ప్లేయర్స్ పట్ల ప్రేక్షకులు చిన్న చూపు చూస్తారు. ఈ టోర్నీలో వ్యక్తిగతంగా నేను దానిని అనుభవించాను. ఇందులో నేను కొన్ని గేమ్స్ ఆడాను.
నాకు వాటి పట్ల గర్వంగా ఉంది. కానీ ప్రేక్షకులు మాత్రం అసలు నా ఆటను పట్టించుకోలేదు. అది తప్ప అన్నీ చూశారు. నేను వేసుకున్న బట్టలు, నా జుట్టు, నేను మాట్లాడే విధానం.. ఇలా సంబంధం లేని అన్ని విషయాలు పట్టించుకున్నారు" అని దివ్య ఆ పోస్టులో చెప్పింది.
ఈ టోర్నీలో దివ్య దేశ్‌ముఖ్ 12వ స్థానంలో నిలిచింది. చెస్ లో మేల్ ప్లేయర్స్ కే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని, మహిళా ప్లేయర్స్ ను వాళ్ల ఆట తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ అంచనా వేస్తున్నట్లు దివ్య ఆరోపించింది. "ఇది చాలా బాధాకర విషయం. కానీ మహిళలు చెస్ ఆడే సమయంలో వాళ్లు ఎంత బాగా ఆడతారో ఎవరూ పట్టించుకోరు.
వాళ్ల సామర్థ్యం ఏంటి, ఎలా ఆడుతున్నారన్నది చూడరు. నా ఇంటర్వ్యూల గురించి ఆడియెన్స్ చర్చించుకున్న తీరు నిరాశ కలిగించింది. చాలా మంది నా ఆట గురించి పట్టించుకోలేదు. చాలా కొద్ది మంది మాత్రమే దాని గురించి మాట్లాడారు. ఇది చాలా బాధాకరం. ఇదే ఎవరైన మేల్ ప్లేయర్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. వాళ్ల ఆట గురించే ఎక్కువగా మాట్లాడతారు" అని దివ్య చెప్పింది.
సహజంగానే వుమెన్ చెస్ ప్లేయర్స్ ను తక్కువ అంచనా వేస్తున్నారని, వాళ్లపై ద్వేషం చూపిస్తున్నారని ఆమె ఆరోపించింది. ప్రతి సంబంధం లేని విషయంపైనా దృష్టి సారించి ద్వేషం వెల్లగక్కుతారని, అదే మేల్ ప్లేయర్స్ విషయంలో ఇలాంటి పట్టించుకోరని దివ్య చెప్పింది. "నా వయసు 18 ఏళ్లు. కానీ ఇప్పటికే నేను చాలా ఏళ్లుగా చాలా విషయాల్లో నా గురించి అంచనా వేశారు. ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాను. చెస్ లో మహిళలకూ సమ ప్రాధాన్యం ఉండాల్సిందే" అని దివ్య స్పష్టం చేసింది.
టాపిక్