Chess World Cup 2023 Final: చెస్ ప్రపంచకప్ ఫైనల్‍లో ప్రజ్ఞానంద ఓటమి.. ప్రశంసించిన ప్రధాని మోదీ
Chess World Cup 2023 Final: చెస్ ప్రపంచ కప్ ఫైనల్‍లో భారత ప్లేయర్ ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. తుదిపోరులో ప్రజ్ఞానందపై మాగ్నస్ కార్ల్‌సన్ విజయం సాధించాడు.
Chess World Cup 2023 Final: చెస్ ప్రపంచకప్ టోర్నీలో చరిత్ర సృష్టిస్తూ ఫైనల్ చేరిన భారత 18ఏళ్ల ప్లేయర్ గ్రాండ్‍మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు తుదిపోరులో ఓటమి ఎదురైంది. నేడు (ఆగస్టు 24) బాకు (అజర్ బైజాన్) వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ టై బ్రేకర్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. ఫైనల్ రెండు గేమ్‍ల్లో అద్భుతంగా ఆడి ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్‍ను నిలురించిన ప్రజ్ఞానంద.. టై బ్రేకర్లో తడబడ్డాడు. దీంతో కార్ల్‌సన్‍కు ప్రపంచకప్ టైటిల్ దక్కింది. చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. రన్నరప్‍గా నిలిచాడు. 18 ఏళ్ల వయసులో ప్రపంచకప్ లాంటి అతిపెద్ద టోర్నీలో అతడు చూపిన ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా, మూడో ర్యాంకర్ ఫాబినో కరునాను చిత్తు చేసి సత్తాచాటాడు ప్రజ్ఞానంద. ఫైనల్ టై బ్రేకర్‌లో కార్ల్‌సన్‍పై కాస్త తడబడిన అతడు.. రన్నరప్‌గా నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ చేరిన రెండో చెస్ భారత ఆటగాడిగా కూడా ప్రజ్ఞానంద రికార్డు దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ టై బ్రేకర్ వివరాలివే..
చెస్ ప్రపంచకప్ ఫైనల్ టై బ్రేకర్లో నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్‌సన్ 1.5 - -0.5 తేడాతో ప్రజ్ఞానందపై గెలిచాడు. చాలా ఏళ్ల నుంచి ప్రపంచ టాప్ ర్యాంకర్‌గా ఉంటూ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‍షిప్ గెలిచిన కార్ల్‌సన్‍కు ఇదే తొలి ప్రపంచకప్ టైటిల్. టై బ్రేకర్ ర్యాపిడ్ తొలి రౌండ్‍లో నల్ల పావులతో ఆడిన కార్ల్‌సన్ తన అనుభవాన్నంతా చూపాడు. ప్రజ్ఞానంద తొలి గేమ్‍లో అతడిని నిలువరించాడు. అయితే, చివరికి కార్ల్‌సన్ గెలిచాడు. రెండో గేమ్‍లోనూ ఇదే జరిగింది. వేగంగా ఎత్తులు వేసిన మాగ్నస్ విజయం సాధించాడు.
ప్రజ్ఞానంద ఈ ఫైనల్ టై బ్రేకర్లో ఓడినా ఈ టోర్నీలో అతడు పోరాడిన తీరు అత్యద్భుతం. ప్రజ్ఞానందను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా అనేక రంగాల ప్రముఖులు ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. “ఫిడే ప్రపంచకప్‍లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రజ్ఞానంద పట్ల మేం గర్విస్తున్నాం. అతడు అద్భుతమైన నైపుణ్యాన్ని చూపాడు. ఫైనల్‍లో కార్ల్‌సన్‍కు గట్టి పోటీని ఇచ్చాడు. ఇది చిన్న విషయం కాదు. రానున్న టోర్నమెంట్లకు అతడికి ఆల్ ది బెస్ట్” అని మోదీ ట్వీట్ చేశారు.
అద్భుతమైన టోర్నమెంట్‍గా మలుచుకున్న ప్రజ్ఞానందకు కంగ్రాచులేషన్స్. నీ కలలను ఛేదిస్తూనే ఉండు. దేశాన్ని గర్వపడేలా చేస్తూనే ఉండు” అని క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు. ఇలా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ప్రజ్ఞానందను ప్రశంసించారు.