Rohan Bopanna: టెన్నిస్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా రోహన్ బొపన్న - నాలుగో ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్
Rohan Bopanna: మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న అత్యధిక వయస్కుడైన ప్లేయర్‌గా ఇండియన్ టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న నిలిచాడు. 43 ఏళ్ల వయసులో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
Rohan Bopanna: ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొపన్న కొత్త రికార్డ్ నెలకొల్పాడు. టెన్నిస్ మెన్స్ డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంకులో నిలిచిన అతిపెద్ద వయస్కుడైన ప్లేయర్‌గా నిలిచాడు. 43 ఏళ్ల వయసులో బొపన్న ఈ ఘనతను అందుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో బొపన్న సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ మాథ్యూ ఎడ్బెన్‌తో కలిసి రోహన్ బొపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్‌లో బరిలోకి దిగాడు.
బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అర్జెంటీనా జంట మాక్జిమో గోంజాలెజ్, అండ్రెస్ మోల్టోనీలపై 6-4 7- 6 రోహన్ బొపన్న, ఎడ్బెన్ జోడీ విజయం సాధించింది. కేవలం 46 నిమిషాల్లోనే అర్జెంటీనా జోడిని బొపన్న, ఎడ్బెన్ చిత్తుచేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరడం బొపన్నకు ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సెమీస్‌లో బొపన్న, ఎడ్బెన్...అన్‌సీడెడ్ ప్లేయర్స్ మెక్‌హక్, జహాంగ్‌లతో తలపడనున్నారు.
అఫీషియల్‌గా ఎప్పుడంటే...
క్వార్టర్ ఫైనల్‌లో గెలుపుతో బొపన్న డబుల్స్‌లో ఫస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే ఆఫీషియల్‌గా మాత్రం ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసిన తర్వాతే ర్యాంకింగ్స్‌ను వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకటిస్తుంది. మెన్స్ డబుల్స్‌లో మూడో ర్యాంకుతో బొపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టాడు. బొపన్న నంబర్ వన్ ర్యాంకు దక్కించుకోగా అతడికి జోడీగా బరిలో దిగిన ఎడ్బెన్ మెన్స్ డబుల్స్‌లో సెకండ్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. బొపన్న, ఎడ్బెన్ జోడీ గత ఏడాది యూఎస్ ఓపెన్ మెన్స్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి పాలయ్యారు.
రాజీవ్ రామ్ రికార్డ్ బ్రేక్...
గతంలో అమెరికన్ క్రీడాకారుడు రాజీవ్ రామ్ 38 ఏళ్ల వయసులో డబుల్స్‌లో నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా రాజీవ్ రామ్ రికార్డును బొపన్న తిరగరాశాడు.
నాలుగో ప్లేయర్…
మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న నాలుగో ప్లేయర్‌గా రోహన్ బొపన్న రికార్డ్ నెలకొల్పాడు. గతంలో లియాండర్ పేస్, మహేష్ భూపతితో పాటు సానియా మీర్జా నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నారు. వారి తర్వాత ఈ ఘనతను దక్కించుకున్న ఇండియన్ ప్లేయర్‌గా రోహన్ బొపన్న నిలిచాడు. ఇరవై ఏళ్ల క్రితం టెన్నిస్ కెరీర్ ప్రారంభించిన బొపన్న 2017లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచాడు. 2010, 2023లో యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచాడు.
టాపిక్