AP Elections Counting : ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం, 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు-సీఈవో ఎంకే మీనా
AP Elections Counting : ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం చేశామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు.
AP Elections Counting : ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన...మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారన్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 8 గంటలకు కౌంటింగ్ మొదలు అవుతుందన్నారు. 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలు అవుతుందని తెలిపారు. కొన్ని చోట్ల లోక్ సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ బ్యాలెట్లు ప్రత్యేకంగా లెక్కింపు జరుగుతుందన్నారు. వేరే హాల్ లో 8 గంటలకు ఈవీఏం కౌంటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు.
33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్
"పార్లమెంటు నియోజక వర్గాలకు 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వ్ లు నియమించాం. టేబుల్ కు మైక్రో అబ్జర్వ్ లు ఉంటారు. అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. దాదాపు 9 గంటల సమయం తర్వాత పూర్తి ఫలితాలు వచ్చేందుకు అవకాశముంది. అలాగే రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో 13 రౌండ్లు ఉన్నాయి ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుంది. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు పడుతుంది. అలాగే కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వస్తాయి" - సీఈవో ముఖేష్ కుమార్ మీనా
కౌంటింగ్ కేంద్రం రెడ్ జోన్
అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మీడియా కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరణ చేసుకోవచ్చన్నారు. కౌంటింగ్ కేంద్రల్లో మొబైల్ ఫోన్ లు అనుమతిలేదని స్పష్టం చేశారు. మీడియాకు మాత్రం నిర్దేశించిన మీడియా సెంటర్ వరకూ మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లవచ్చన్నారు. కౌంటింగ్ రోజు మద్యం దుకాణాలు ముసివేస్తూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లోనూ మద్యం విక్రయాలు జరగవన్నారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు దృష్ట్యా 67 కంపెనీల సాయుధ భద్రత బలగాలు ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలు, శాంతి భద్రతల కోసం వినియోగిస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించామన్నారు. పోలింగ్ రోజు జరిగిన హింస మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. 185 హింస జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 12 వేల మందిని గుర్తించి బైండోవర్ చేశామన్నారు. అలాగే పోలీసు పికెట్ లు పెట్టామన్నారు. క్యూఆర్టీ టీమ్ లు, కార్డెన్ సెర్చ్ చేస్తున్నామన్నారు. పోలింగ్ తరువాత 1400 చోట్ల కర్డెన్ సెర్చ్ చేశామన్నారు.
ఊరేగింపులకు నో ఛాన్స్
పుకార్లు కూడా పెద్ద ఎత్తున పెట్రేగెందుకు అవకాశం ఉందని, దాన్ని ఎదుర్కొనేందుకు కూడా చర్యలు చేపట్టామన్నారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. ప్రతి పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. 67 కంపెనీల సాయుధ భద్రతా సిబ్బంది, 45 వేల మంది పోలీసులను పూర్తి స్థాయిలో మొహరిస్తున్నామన్నారు. ఎలాంటి చిన్న ఘటన కూడా జరక్కుండా చూడటమే ఈసీ బాధ్యత అన్నారు. ఎన్నికల విధుల్లో సీనియర్ అధికారులను నియమించామన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్ లు అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తే బయటకు పంపుతామన్నారు. కేసు పెట్టి జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. సరైన కారణాల ఉంటే మాత్రమే రీకౌంటింగ్ కు ఆదేశాలు ఇస్తామన్నారు. రేపు కౌంటింగ్ రోజు ఫలితాలు వచ్చినా ఊరేగింపులు చేసుకునేందుకు అవకాశం లేదని తెలిపారు.
సంబంధిత కథనం