Election Counting: ఓట్ల లెక్కింపుకు అవాంతరాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు..-ec orders to take strict action in case of disturbance for election counting ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Counting: ఓట్ల లెక్కింపుకు అవాంతరాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు..

Election Counting: ఓట్ల లెక్కింపుకు అవాంతరాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు..

Sarath chandra.B HT Telugu
Jun 03, 2024 05:53 AM IST

Election Counting: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశించింది. అవాంతరాలను సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపేయాలని స్పష్టం చేసింది.

ఏపీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సీఈఓ మీనా
ఏపీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సీఈఓ మీనా

Election Counting: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భండా ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదని ఎన్నికల ప్రధాన అధికారి ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించాలని, ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లను 5వ తేదీకల్లా ఈసీఐ కి చేరేలా చూడాలన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటు వంటి అవాంతరాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడంతో పాటు చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.

ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఈ నెల 4 వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు.

ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4 వ తేదీతో పాటు దానికి ముందు, తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. ఇటు వంటి భావోద్వేగాలతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా, వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సీల్ వేసి భద్ర పర్చండి…

ఈవీఎంల కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపర్చాలని, మరుసటి రోజు చేద్దాంలే అనుకుంటూ ఆ పనిని వాయిదాను వేయవద్దన్నారు. ఫలితాల ప్రకటనకు సంబందించిన ఫారం-21సి/21ఇ లు ఓట్ల లెక్కింపు దినానికి మరుసటి రోజే ఈసీఐ కి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని, అందుకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇండెక్సు కార్డులో ఎటు వంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డును పూరించాలని, ఆయా కార్డులు అన్నీ ఈ నెల 8 వ తేదీలోపు తమ కార్యాలయానికి అందజేయాలన్నారు.

ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలని, అయితే ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్ కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను లేక పెన్సిల్ మరియు ప్లైయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలని, అంతకు మించి ఏమి ఉన్నా అనుమతించవద్దన్నారు. అథారిటీ లెటర్సు కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రంలోకి అనుమతించాలని, వారు సెల్ పోన్ కలిగిఉన్నప్పటికీ ఏమాత్రము అభ్యంతరం తెలపద్దని, అయితే కౌంటింగ్ సెంటర్లోకి మాత్రం సెల్ పోన్ తో వారిని అనుమతించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి దృవీకరణ పత్రాన్ని తప్పని సరిగా పొందాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశం మరియు నిష్క్రమణ ప్రణాళిక ను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని, ఈ ప్రణాళికకు జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు. అదే విధంగా ప్రవేశం మరియు నిష్క్రమణ ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్ని చోట్లా ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళిక బద్దంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు.

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉండనుంది. విజయోత్సవ ర్యాలీలకు కూడా అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం