Asian Games Gold: ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్.. వరల్డ్ రికార్డుతో అదరగొట్టిన షూటర్లు
Asian Games Gold: ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ దక్కింది. మన షూటర్లు అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ లో ఈ గోల్డ్ మెడల్ రావడం విశేషం.
Asian Games Gold: ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా గోల్డ్ మెడల్స్ ఖాతా తెరిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరి తోమార్, దివ్యాన్ష్ పన్వర్ లు ఈ ఈవెంట్లో గోల్డ్ గెలిచారు. అంతేకాదు వరల్డ్ రికార్డుతో ఈ గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఈ ముగ్గురూ ఏకంగా 1893.7 పాయింట్లతో క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఈ త్రయం వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది.
ఈ ఏడాది మొదట్లో బాకు వరల్డ్ ఛాంపియన్‌షిప్ లో చైనా సెట్ చేసిన రికార్డును వీళ్లు బ్రేక్ చేశారు. ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియాకు ఇదే తొలి గోల్డ్ మెడల్. ఫైనల్లో ఇండియన్ షూటర్లు కాస్త నెమ్మదిగానే మొదలుపెట్టారు. తొలి సిరీస్ లో రుద్రాంక్ష్, దివ్యాన్ష్ చెరో 104.8 పాయింట్లు, ఐశ్వరి 104.1 పాయింట్లు సాధించారు. అయితే తర్వాత సిరీస్ నుంచి పుంజుకున్నారు.
ఆరో సిరీస్ సమయానికి ఇండియన్ షూటర్లు వరల్డ్ రికార్డు బ్రేక్ చేశారు. మొత్తంగా 1893.7 పాయింట్లు సాధించారు. ఈసారి ఏషియన్ గేమ్స్ లో 100 మెడల్స్ రికార్డు బ్రేక్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇండియాకు ఈ గోల్డ్ మెడల్ ఓ బూస్ట్ లాంటిదే. ఇప్పటికే మూడు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ కూడా ఇండియా సొంతమైన విషయం తెలిసిందే.
అటు వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లోనూ ఇండియా సిల్వర్ మెడల్ గెలిచింది. ఆషి చౌక్సీ, మెహెలి ఘోష్, రమితా జిందల్ లు ఇండియాకు మెడల్ అందించారు. ఇక ఇప్పుడు పురుషుల ఈవెంట్లో ఏకంగా వరల్డ్ రికార్డుతో గోల్డ్ గెలవడం ఇండియాకు మరుపు రానిదే.