Vijaya ekadashi: రేపే విజయ ఏకాదశి.. మీ శత్రువులపై విజయం సాధించాలంటే రేపు ఇలా చేయండి-tomorrow is vijaya ekadashi do this method to lord vishnu puja win over your enemies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vijaya Ekadashi: రేపే విజయ ఏకాదశి.. మీ శత్రువులపై విజయం సాధించాలంటే రేపు ఇలా చేయండి

Vijaya ekadashi: రేపే విజయ ఏకాదశి.. మీ శత్రువులపై విజయం సాధించాలంటే రేపు ఇలా చేయండి

Gunti Soundarya HT Telugu
Mar 04, 2024 02:42 PM IST

Vijaya ekadashi: విజయాలని ఇచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణుమూర్తిని క్రమ పద్ధతిలో పూజించడం వల్ల మీరు అన్నింటా విజయం సాధిస్తారు.

విజయ ఏకాదశి రోజు ఏం చేయాలి?
విజయ ఏకాదశి రోజు ఏం చేయాలి?

Vijaya ekadashi: ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. ఈ ఏడాది మార్చి 6వ తేదీన విజయ ఏకాదశి జరుపుకొనున్నారు. ఏకాదశికి హిందూమతంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ వ్రతం పాటించడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ పవిత్రమైన రోజున మహా విష్ణువుని పూజించి ఉపవాసం ఉండటం వల్ల ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మరణం తర్వాత మోక్షం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం.

శుభ ముహూర్తం

విజయ ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 6 ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై ఏకాదశి తిథి మార్చి 7 ఉదయం 4:13 గంటలకు ముగుస్తుంది.

ఏకాదశి వ్రతం విధానం

తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించాలి. వీలుపడని వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరంలో పీట వేసి దానిమీద పసుపు వస్త్రం పరిచి విష్ణు విగ్రహాన్ని పెట్టాలి. పంచామృతం, గంగా జలంతో విష్ణువుని అభిషేకించాలి. పసుపు గంధం, పసుపు పువ్వులు సమర్పించాలి. నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ధూపం, పండ్లు, నైవేద్యం, తులసి ఆకులు భోగంగా సమర్పించాలి. తర్వాత విష్ణు సహస్రనామం పఠించాలి. విజయ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయాలి. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి. విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది.

విజయ ఏకాదశి ప్రాముఖ్యత

విజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది. ఈ వ్రతం పాటించడం వల్ల పూర్వం రాజులు, చక్రవర్తులు చాలా యుద్ధాలలో విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆచరించి విష్ణువుని పూజించిన వారికి శత్రువులు ఎటువంటి పరిస్థితుల్లో కలిగించిన వాటి నుంచి బయటపడగలుగుతారు. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.

ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు

‘ఓం నారాయణాయ లక్ష్మీ నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఉద్యోగం పొందుతారు.

‘ఓం సీతాపతే రామ్ రామాయ నమః’ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.

‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.

ఏకాదశి రోజు చేయాల్సిన పనులు

విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల దాంపత్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు మీకు వీలయినంతవరకు దానాలు చేసేందుకు ప్రయత్నించండి.

ఏం చేయకూడదు

సనాతన ధర్మం ప్రకారం విజయ ఏకాదశి నాడు అన్నం తినకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి. తప్పనిసరిగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసం, ఆల్కహాల్, ఉల్లిపాయలు, లేదా వెల్లుల్లి తీసుకోకూడదు. ఏకాదశి తిథి ప్రారంభానికి ముందు రోజు నుంచి వీటిని తీసుకోవడం మానేయాలి.

Whats_app_banner