Magha Ekadashi: మాఘ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ఈ వ్రత కథ గురించి మీరు తెలుసుకోండి
Magha ekadashi: మాఘ మాసంలో వచ్చే ఏకాదశి నాడు వ్రతం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ వ్రత కథ విశిష్టత గురించి చిలకమర్తి చక్కగా వివరించారు.
Magha ekadashi: మాఘ మాసం శుక్షపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా ఖైమీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు చేసే వ్రతం గురించి శ్రీ కృష్ణ ధర్మరాజుల సంవాదరూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణింపబడిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒకసారి ధర్మరాజు శ్రీ కృష్ణుని మాఘ శుక్ష పక్షంలో వచ్చే ఏకాదశి మహిమను చెప్పాల్సిందిగా కోరాడు. అందుకు ప్రత్యుత్తరంగా శ్రీ కృష్ణుడు ధర్మరాజా! మాఘశుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి జయఏకాదశిగా సుప్రసిద్ధమైంది. ఈ ఏకాదశి వ్రతం పాటించడం ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడూ దెయ్యంగా మారడు. ముక్తిని ప్రసాదించడంలో, పాప నాశనంలో ఈ ఏకాదశికి మించింది లేదని చిలకమర్తి తెలిపారు.
మాఘ మాసం వ్రత కథ
దేవతలందరు దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు. అక్కడ నందనవనం పారిజాత పుష్పసారభంతో నిండి ఉండేది. అప్సరసలు అక్కడ స్వేచ్చగా విహరించేవారు. ఇంద్రుడు కూడ ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు.
ఒకసారి ఇంద్రుడు నందవనంలో ఐదుకోట్ల అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు. చిత్రసేనుడనే గంధర్వుడు తన భార్య మాలిని, కుమార్తె, పుష్పవనుడి పుత్రుడు అక్కడకు వచ్చాడు. పుష్పవనుడి పుత్రుడు మలయవానుడు. పుష్పవతి అనే గంధర్వి మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలు అయ్యింది. మన్మథ బాణ పీడితయైన పుష్పవతి మలయ వానుని ఆకర్షించడానికి, లోబరచుకోవడానికి అనేక రకాలుగా యత్నించింది.
ఇంద్రుని కోరిక ప్రకారం మలయవానుడు, పుష్పవతి ఇతర అప్సరసలతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలు పెట్టారు. కాని పరస్పరాకర్షణ వల్ల మలయవానుడు, పుష్పవతి చక్కగా నృత్యం చేయలేక పోయారు. తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు. మన్మథబాణపీడితులై వారిద్దరు ఓర చూపులతో ఒకరినొకరు చూచుకోసాగారు.
నృత్య గాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు. కార్యక్రమంలో కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు. మూర్ఖులు, పాపులు అయిన మీరిద్దరు నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా పురుష దెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అను భవించండని శపిస్తాడు.
ఆ రీతిగా శపించబడ్డ మలయవానుడు, పుష్పవతి పిశాచాలుగా మారి హిమాలయ పర్వత గుహలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. దెయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖం, శోకం కలిగాయి. శాపకారణంగా వారికి సుఖం, నిద్ర కొరవడ్డాయి.
హిమాలయ ప్రాంతంలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒకచోట కూర్చొని బాధపడసాగారు. అప్పుడు పురుష దెయ్యం స్త్రీ దెయ్యంతో ఇంతటి ఘోరమైన పిశాచరూపాలు రావడానికి మనమెంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అన్నాడు. తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాలు పశ్చాత్తాపసాగరంలో మునిగిపోయాయి. దెయ్యాల రూపాలలో ఉన్న మలయవానుడు, పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాపపడుతూ ఎలాంటి అహారం తీసుకోలేదు. అనుకోకుండా అ రోజు జయ ఏకాదశి అయింది.
ఆకలిదప్పులతో ఉన్నప్పటికీ వారు ఏ జీవినీ ఆ రోజు చంపలేదు. కందమూలాలు గానీ, జలం గాని వారు తీసు కోలేదు. ఆ రీతిగా ఆ దెయ్యం జంట ఒక అశ్వత్థ వృక్షం క్రింద కూర్చొని ఉండగా సూర్యాస్తమయం అయింది. వణికే చలిలో, తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్రలేకుండానే గడిపారు. మానసిక కలత వల్ల వారి హృదయాలలో ఇంద్రియ భోగ భావనే కలుగలేదు. ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది. వ్రతపాలన ప్రభావంగా మర్నాడే వారు దెయ్యాల రూపం నుండి ముక్తిని పొందారు.
పుష్పవతి, మలయవానుడు ఇద్దరూ తిరిగి తమ రూపాలను పొంది స్వర్గలోకానికి వెళ్ళి దేవరాజైన ఇంద్రునికి అభివాదం చేశారు. అది చూచి అశ్చర్యపడిన ఇంద్రుడు వారితో “ఎంత అద్భుతం! ఏ పుణ్యప్రభావం వల్ల మీకు దెయ్యాల రూపం పోయింది? ఏ దైవం మీకు నా శాపం నుండి ముక్తిని ప్రసాదించాడు?” అని అన్నాడు.
దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో “దేవదేవుని నిర్దేతుక కరుణ వల్ల, ఆతనికి పరమప్రియమైన జయ ఏకాదశి వ్రతపాలన వల్ల మేము శాపవిముక్తుల మయ్యాం. ప్రభూ! కేవలం భక్తి ప్రభావం వలననే మేము దెయ్యాలరూపంనుండి ముక్తులమయ్యామని పూర్ణ విశ్వాసంతో చెబుతున్నాను” అని అన్నాడు.
ఈ మాటలను విన్న దేవేంద్రుడు మలయవానునితో “ఏకాదశిని పాటించడం ద్వారా, విష్ణుపూజను చేసిన కారణం గానే మీరు పవిత్రులయ్యారు. కాబట్టి మీరు నాకు కూడ పూజనీయులు. విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు, నాకు ఆదరణీయులు” అని అన్నాడు. తరువాత మలయవానుడు పుష్పవతి, స్వర్గంలో సుఖంగా జీవించారు.
పాప విముక్తులను చేస్తుంది
ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. జయ ఏకాదశి వ్రతపాలనం బ్రహ్మహత్యాపాతకాన్నైనా పరిహరిస్తుంది. దానం, యజ్ఞం, తీర్థాటనం వలన కలిగే పుణ్యం ఈ వ్రతం చేయడం వల్ల అప్రయత్నంగానే లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తిశద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు. ఈ ఏకాదశి మహిమను చదవడం, వినడం ద్వారా మనిషి యాగఫలాన్ని పొందుతాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.