Bhishma Parvam: భీష్మ పర్వం ప్రాముఖ్యత ఏంటి? భీష్మ ఏకాదశి సందేశం ఏంటి?
Bhishma Parvam: ఉత్తరాయణ కాలంలో ప్రాణాలు విడిచిన వ్యక్తి భీష్ముడు. మాఘ మాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. పురాణ గ్రంథం భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలోని ఒక భాగం.
Bhishma Parvam: భారతీయ జనజీవనంతో పెనవేసుకుపోయిన భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలోని ఒక భాగం అని కొంతమందికి తెలియకపోవడం విచిత్రం. ఎందుకంటే భగవద్గీత మూల గ్రంథాన్ని మించిన ప్రాముఖ్యాన్ని పొందగలిగింది. భీష్మపర్వానికే కాదు, యావన్మహాభారత గ్రంథానికే మకుటాయమానమైంది ఈ భగవద్గీత. ఇందులో ఇముడ్చుకున్న భీష్మపర్వం మరెన్నో భౌతిక, ఆధ్యాత్మిక రహస్యాలను తెలిపిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భౌతిక విషయ పరిజ్ఞానంలో యుద్ధ వ్యూహాలకు, ఆయుధాలకు వాటి ప్రయోగాలకు సంబంధించి ఎన్నో విశేషాలను భీష్మపర్వం తెలియజేస్తుంది. వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నడంలోనూ, శత్రువుల వ్యూహాలను ముందుగా కనిపెట్టడంలోనూ, వివిధ ఆయుధాలను ప్రయోగించడంలోనూ, ఉపసంహరించడంలోనూ పూర్వుల పరిజ్ఞానం ఈ పర్వంలో వ్యక్తం అవుతుంది.
అచలవ్యూహం, సూచీవ్యూహం, గరుడ వ్యూహం, సర్ప వ్యూహం, పద్మవ్యూహం మొదలైన వ్యూహాలు పన్ని ఒకరిపై ఒకరు విజిగీషువులై ప్రవర్తించిన విధానమంతా భీష్మపర్వంలో వర్ణింపబడింది. ఆనాటి సైనికుల సేనాధిపతులు సూక్ష్మబుద్ధి, గ్రహణశక్తి, ధైర్యం మొదలైన విషయాలు ఈ పర్వంలో చదువుతూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాయని చిలకమర్తి తెలిపారు.
భీష్మ పర్వం ప్రాముఖ్యత
ఇక ఆధ్యాత్మికంగా భీష్మపర్వం ఒక తాత్త్విక సందేశాన్ని అందిస్తుంది. మన సాహిత్యంలో ఆదికావ్యమైన రామాయణం ఆదర్శ జీవనానికి ఆధారం. భాగవతం దివ్యజీవనానికి దీప ముఖం. మహాభారతం నిజజీవితానికి నిక్కచ్చి అయిన ఉదా హరణ. నిజానికి మానవజీవితమే ఒక కురుక్షేత సంగ్రామం. ఏ వ్యక్తికావ్యక్తి తన దేహంతో తానే ఒక మహాభారత సంగ్రామం చేస్తున్నాడు. ఇందులో ధర్మరాజు జీవాత్మ. పవననందనుదైన భీముడు ప్రాణవాయువు. మనోబుద్ధ్యహంకారాలే అర్జున బాణాలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలే నకులసహదేవులు.
జీవాత్మని ఆవహించిన మహామాయ ద్రౌపది. అరిషడ్వర్లాలే కౌరవ సైన్యం. జీవుడు పొందిన పరమాత్మాశయమే శ్రీకృష్ణసారథ్యం. ఈ విధంగా భవబంధాలతో పోరాడి జీవుడు పరమాత్మ సహాయం ద్వారా ఆత్మైక్యాన్ని పొందగలగడమే మహాభారత యుద్ధపర్వాలలోని ఆధ్యాత్మిక రహస్యం. జీవి ఆధ్యాత్మిక సాధనలో చేసే ప్రయత్నమంతా భౌతికంగా యుద్ధరూపంలో మహాభారతంలో వర్ణింపబడింది. వివిధ ఆయుధాలన్నీ వివిధప్రయత్నాలే.
యుద్ధవ్యూహాలన్నీ ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే అంతర్గత శత్రు వ్యూహాలుగానే కనిపిస్తాయి. యుద్ధంలో వ్యూహం అనేది తక్కువ సైన్యంతోనైనా ఎక్కువ ప్రయోజనం పొందడానికి చేసే ఏర్పాటు. వ్యూహాలన్నీ మానవ ప్రయత్నాలు. పరమాత్మాను గ్రహమే అంతిమంగా విజయసాధనం.
ఆ దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని లక్షల సైన్యం ఉన్నా ఒక్కటే అనే విషయం కౌరవుల ఓటమి ద్వారా రుజువైంది. దైవానుగ్రహం ఉంటే పగలు రాత్రిగాను, రాత్రి పగలుగాను మారుతుందనడానికి సైంధవవధ ఘట్టం ఉదాహరణ అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.