Red alert in Mumbai: ముంబైని ముంచెత్తిన కుండపోత వాన; నగరానికి రెడ్ అలర్ట్; విమానాల డైవర్షన్
దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షంతో ముంబై మహా నగరం అతలాకుతలమైంది. వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. కుర్లా, భందుప్, విఖ్రోలి వద్ద రైలు పట్టాలు వరద నీటిలో మునిగాయి. దీంతో సెంట్రల్ రైల్వే మార్గంలో రాకపోకలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి.
ముంబై, పాల్ఘర్, సతారా సహా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు కురుసాయి. బుధవారం రాత్రి కూడా ముంబైలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ, నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
అత్యవసరమైతేనే..
బుధవారం సాయంత్రం నుంచి ముంబై నగరంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వరద నీటిలో మునిగిపోయాయి. దాంతో, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైకి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పౌరులు అత్యవసరమైతేనే బయటకు రావాలని, లేదంటో ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. ఆరుబయట వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
విమానాల దారి మళ్లింపు
భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పటికే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతకు ముందు గాలుల ధాటికి ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్ కు మళ్లించారు. ఇండిగో విమానంతో పాటు మరో 9 విమానాలను దారి మళ్లించారు. బుధవారం రాత్రి కూడా విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్ లేదా టేకాఫ్ సాధ్యం కాకపోవచ్చని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
సబర్బన్ రైళ్ల నిలిపివేత
కుండపోత వర్షం కారణంగా ముంబై సబర్బన్ రైలు నెట్ వర్క్ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. కుర్లా, భందుప్, విఖ్రోలి వద్ద రైలు పట్టాలు మునిగిపోవడంతో సెంట్రల్ రైల్వే మార్గంలో గంట వరకు ఆలస్యమైంది. నహుర్, కంజుర్మార్గ్, విద్యావిహార్ స్టేషన్లలో రైళ్లు ఆగవని ఆయా స్టేషన్లలో ప్రకటనలు జారీ చేశారు. దాంతో, చర్చిగేట్, ఇతర స్టేషన్ల వద్ద భారీ రద్దీకి దారితీసింది. సబర్బన్ రైలు వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముంబై, పరిసర ప్రాంతాలకు ఐఎండీ సూచన
ఉత్తర కొంకణ్ ప్రాంతంలో అల్పపీడనం నుంచి మధ్యస్థాయి వరకు ద్రోణి బలపడటంతో రానున్న రోజుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ముంబై, కొంకణ్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో రానున్న రెండు, మూడు రోజుల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడన ద్రోణి
64.5 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతుందని, కొన్ని ప్రాంతాల్లో 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు విస్తరించిన ఈ ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా వాయుగుండంగా కదులుతోందని ఐఎండీ (IMD alerts) వర్గాలు తెలిపాయి.