Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్: 8 మంది మావోలు, ఒక జవాను మృతి
Chhattisgarh encounter: చత్తీస్ గఢ్ లోని అబూజ్ మఢ్ అడవుల్లో మావోయిస్ట్ లకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. భద్రతాదళాలతో శనివారం తెల్లవారు జామున జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది నక్సలైట్లు చనిపోయారు. మావోల కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు.
Chhattisgarh encounter: అబుజ్ మఢ్ లో శనివారం తెల్లవారు జామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాను కూడా మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా మావోయిస్ట్ లు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
అబూజ్ మఢ్ కేంద్రంగా..
అబూజ్ మఢ్ (Abujhmarh) దట్టమైన అడవిలోని ఒక కొండ ప్రాంతం. ఇది నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. భౌగోళికంగా మావోయిస్ట్ లకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడికి చేరుకోవడం అత్యంత క్లిష్టతరం. ఈ ప్రాంతాన్ని మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా పరిగణిస్తారు.
జూన్ 12 నుంచి జాయింట్ ఆపరేషన్
నారాయణపూర్, కంకేర్, దంతెవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్త బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరిన సమయంలో శనివారం ఉదయం అబూజ్ మఢ్ అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ నాలుగు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) 53వ బెటాలియన్ సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్ జూన్ 12న ప్రారంభమైంది.
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి చత్తీస్ గఢ్ కేంద్రంగా మావోయిస్ట్ ల ఏరివేత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. మావోల జాడపై సమాచారం తెలిసిన వెంటనే సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి, ఎన్ కౌంటర్ లు చేపడ్తున్నారు. ఈ ఆపరేషన్ లో ఇప్పటికే చాలామంది మావోలు మృతి చెందారు. ఇటీవల నారాయణపూర్ జిల్లాలో ఆరుగురు మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆ మావోలపై మొత్తం రూ.38 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలంలో యూనిఫాం ధరించిన ఆరుగురు నక్సలైట్ల మృతదేహాలతో పాటు రెండు .303 రైఫిల్స్, ఒక .315 బోర్ రైఫిల్, 10 బీజీఎల్ (బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్) షెల్స్, ఒక ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్, కుక్కర్ బాంబు, ఐదు బ్యాగులు, భారీ పేలుడు పదార్థాలు, మందులు, నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.