Maoists surrender: బస్తర్ లోని బీజాపూర్ లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు-chhattisgarh 33 maoists surrender in bastars bijapur ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maoists Surrender: బస్తర్ లోని బీజాపూర్ లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు

Maoists surrender: బస్తర్ లోని బీజాపూర్ లో లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు

HT Telugu Desk HT Telugu

మావోయిస్ట్ ల అణచివేతకు బహు ముఖ వ్యూహంతో ముప్పేట దాడిని పోలీసులు కొనసాగిస్తున్నారు. ఒకవైపు, ఎన్ కౌంటర్ లలో పెద్ద ఎత్తున నక్సలైట్లను హతమారుస్తున్నారు. మరోవైపు, మావోలను లొంగిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. తాజాగా, 33 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

33 మంది మావోల లొంగుబాటు

Maoists surrender in Chhattisgarh: చత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో ఉన్న బీజాపూర్ జిల్లాలో 33 మంది మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ముందు లొంగిపోయారని బీజాపూర్ పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారు. పోలీసుల పునరావాస విధానం తమను ఆకట్టుకుందని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పినట్లు పోలీసు అధికారులు తెలిపారు. లొంగిపోయిన 33 మంది మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, వీరు మావోయిస్టుల గంగలూరు ఏరియా కమిటీ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థల్లో క్రియాశీలకంగా ఉన్నారని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

లొంగిపోయిన మావోల వివరాలు

లొంగిపోయిన 33 మంది మావోయిస్ట్ ల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ నంబర్ 1 సభ్యుడు రాజు హేమ్లా అలియాస్ ఠాకూర్ (35), మావోయిస్టుల ప్లాటూన్ నంబర్ 1 సభ్యుడు సామో కర్మ ఉన్నారు. వారిపై రూ.2 లక్షల రివార్డు ఉంది. అలాగే, మావోయిస్టుల జనతా సర్కార్ రివల్యూషనరీ పార్టీ కమిటీ (RPC) కి నేతృత్వం వహిస్తున్న సుద్రు పునేమ్ కూడా లొంగిపోయారని, అతడిపై లక్ష రూపాయల రివార్డు ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన ఈ ముగ్గురు కేడర్లు గతంలో భద్రతా సిబ్బందిపై దాడులకు పాల్పడినట్లు తెలిపారు. తాజాగా లొంగిపోయిన నక్సలైట్లతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 109 మంది నక్సలైట్లు హింసను వీడినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో జిల్లాలో 189 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.