Constable Representation: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌కు అడ్డు పడేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించడంతో మంగళవారం కలకలం రేపింది. సిఎం గుంటూరు పర్యటన ముగించుకుని తాడేపల్లి నివాసానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
సీఎం కాన్వాయ్‌కి ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అడ్డుపడేందుకు ప్రయత్నించిన ఘటన మంగళవారం తాడేపల్లిలో చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మద్దాలి గిరి తల్లి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు వెళ్లిన సీఎం హెలికాప్టర్‌లో తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి తన కాన్వాయ్‌లో ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది
మంగళవారం మధ్యాహ్నం హెలిప్యాడ్ నుంచి సీఎం తన వాహనంలో నివాసానికి బయలుదేరారు. గార్డు-1 పాయింట్‌లో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న విశాఖకు చెందిన 16వ ఏపీఎస్పీ బెటాలియన్ బి-కంపెనీలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్ పెద్దిరెడ్డి భాగ్యరాజు కాన్వాయ్‌లో సిఎం వాహనానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు.
సిఎం కాన్వాయ్‌కు కానిస్టేబుల్ అడ్డుగా రావడాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కాన్వాయ్‌లో చొరబడేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్‌ని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సిఎం భద్రతా వలయాన్ని పోలీస్ కానిస్టేబుల్ ఇబ్బంది కలిగించడంతో ఉన్నతాధికారులు మండిపడ్డారు.
పోలీసులు అదుపులో తీసుకున్న కానిస్టేబుల్ మాత్రం తాను సిఎంకు వినతి పత్రం ఇవ్వడానికే ముందుకు వెళ్లినట్లు వివరించాడు. తాను విశాఖలో పనిచేస్తుండగా తన భార్య విజయవాడలో పని చేస్తోందని ఇద్దరినీ ఒకే చోట పనిచేసేందుకు అవకాశమివ్వాలని సీఎంను కోరే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు విచారణలో వెల్లడించాడు. కానిస్టేబుల్ వినతి పత్రం ఇవ్వడానికి అనుసరించిన పద్దతిపై అధికారులు సెక్యూరిటీ లోపాలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి భద్రత కోసం ఏపీఎస్పీ బలగాలను దీర్ఘ కాలం క్యాంపులు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఢిల్లీ ఏపీ భవన్‌తో పాటు విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయం వద్ద పోలీసుల్ని వినియోగిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా నెలల తరబడి గడపాల్సి వస్తుండటంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా ఉన్న దాంట్లోనే సర్దుకు పోవాల్సి వస్తోంది.
మంగళవారం తెల్లవారుజామున రాజధానిలో బందోబస్తు విధుల కోసం వచ్చిన కానిస్టేబుల్ అనంతవరంలో విశ్రమిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో ఆలయ మండపంలో విశ్రమించిన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పాముకాటుకు గురైన కానిస్టేబుల్‌ను సహచరులు హుటాహుటిన గుంటూరు జిజిహెచ్ తరలించారు.
ఈ కోవలోనే కుటుంబానికి దూరమైన కానిస్టేబుల్ తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సిఎంకు విన్నవించుకుందామని ప్రయత్నించాడని సహచరులు చెబుతున్నారు. మరోవైపు సిఎం సెక్యూరిటీ లోపాలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్‌పై శాఖపరమైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు.