Chhattisgarh: చత్తీస్ గఢ్ లో బీజేపీ నేతను దారుణంగా చంపేసిన నక్సలైట్లు
Chhattisgarh crime news: మరో మూడు రోజుల్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్ గఢ్ లో బీజేపీ నాయకుడిని మావోయిస్టులు దారుణంగా చంపేశారు. ఎన్నికల ప్రచారంలో ఉండగా, మావోయిస్టులుగా భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు.
Chhattisgarh crime news: రతన్ దూబే (Ratan Dubey) చత్తీస్ గఢ్ లో బీజేపీ నాయకుడు. నారయణ పూర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడి గా ఉన్నారు. నారాయణ పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు బీజేపీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మరో మూడు రోజుల్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్థానికంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

నవంబర్ 7న..
చత్తీస్ గఢ్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు నవంబర 7వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నారయణ పూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నేత రతన్ దూబేను శనివారం సాయంత్రం మావోయిస్టులు కత్తులతో నరికి చంపేశారు. ఈ ఘటన నారయణ పూర్ జిల్లాలోని కౌశల్నార్ గ్రామంలోని మార్కెట్ ఏరియాలో చోటు చేసుకుంది. ప్రచారంలో ఉన్న రతన్ దూబే ను చుట్టుముట్టిన మావోలు.. అతడిపై గొడ్డళ్లతో దాడి చేసి, చంపేశారని పోలీసులు వెల్లడించారు. నవంబర్ 7వ తేదీన పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో నారాయణ పూర్ కూడా ఉంది.
గాలింపు
సమాచారం తెలియగానే పోలీసు దళాలు అక్కడికి చేరుకున్నాయి. రతన్ దూబేను ఆసుపత్రికి తరలించాయి. ఈ దారుణానికి పాల్పడిన నక్సలైట్ల కోసం గాలింపు ప్రారంభించాయి. రతన్ దూబే దారుణ హత్యపై బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దూబే మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నామని, ఈ దారుణాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ నేత ఓం మాథుర్ ట్వీట్ చేశారు. గతంలో, అక్టోబర్ 20వ తేదీన బీజేపీ కార్యకర్త బిర్జు తారమ్ ను అంబాఘర్ చౌకీ జిల్లాలో మావోయిస్టులు కాల్చి చంపారు.