Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్: ఐదుగురు నక్సలైట్లు మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు
Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. నారాయణపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో భద్రతా సిబ్బంది చేపట్టిన నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Chhattisgarh encounter: చత్తీస్ గఢ్ లో భద్రతాబలగాలు, మావోయిస్ట్ ల మధ్య ఎదురుకాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా, శుక్రవారం నారాయణపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్ట్ ల మధ్య మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు నక్సల్స్ మరణించారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
ఇప్పటివరకు 112 మంది నక్సల్స్ మృతి
నారాయణపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బంది చేపట్టిన నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్లలో 122 మంది నక్సలైట్లు చనిపోయారు. నారాయణపూర్, కొండగావ్, దంతెవాడ, బస్తర్ జిల్లాలకు చెందిన పోలీసు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ 45వ బెటాలియన్ సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఆయుధాలు, సాహిత్యం
ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి యూనిఫాం ధరించిన ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దుకు సమీపంలోని భీమాంఖోజీలో నక్సల్స్ శిబిరాన్ని మహారాష్ట్ర పోలీసులు ఛేదించిన సమయంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో నక్సల్స్ వస్తువులు, సాహిత్యం, మందులు, సంచులు, వండిన భోజనం, నిత్యావసరాలు స్వాధీనం చేసుకున్నారు.
టిపగడ్, కసన్సూర్ దళాల కోసం..
భీమన్ ఖోజి ప్రాంతంలోని టిపగడ్, కసన్సూర్ దళాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు అదనపు ఎస్పీ కుమార్ చింతా ఆధ్వర్యంలో సి60 పార్టీలు, సీఆర్పీఎఫ్ కి చెందిన మరో బృందం గాలింపు చర్యలు చేపట్టారని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్ పాల్ తెలిపారు. సీ 60 కమాండోలు కొండపైకి రావడాన్ని చూసి మావోయిస్టులు దట్టమైన అడవుల్లోకి తప్పించుకున్నారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టామని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.
వరుస ఎన్ కౌంటర్లు
మే 23న నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అడవిలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మరణించగా, మే 10న బీజాపూర్ జిల్లాలో 12 మంది హతమయ్యారు. కాగా, ఏప్రిల్ 30న నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అడవిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మహిళలతో సహా 10 మంది నక్సలైట్లు మరణించగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో 29 మంది మరణించారు.