Jawahar Navodaya: జవహర్ నవోదయాల్లో 6వ తరగతి అడ్మిషన్ల గడువు పొడిగింపు; వెంటనే ఇలా అప్లై చేసుకోండి..
Jawahar Navodaya Vidyalaya: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఉద్దేశించిన జేఎన్వీఎస్టీ 2025 కి దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని తల్లిదండ్రులు అక్టోబర్ 7 లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
Jawahar Navodaya Vidyalaya: జవహర్ నవోదయ విద్యాలయ ల్లో 2025 ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీని 2024 అక్టోబర్ 7 వరకు పొడిగిస్తున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్ తెలిపింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 (JNVST 2025) కోసం దరఖాస్తు చేయాలనుకునే తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఎన్విఎస్ అధికారిక వెబ్సైట్ navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మరో డైరెక్ట్ లింక్ cbseitms.rcil.gov.in వెబ్ సైట్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?
2025-26 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయ ల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తుది గడువును పొడిగించారు. పరిపాలనా కారణాల రీత్యా ఆన్ లైన్ దరఖాస్తు గడువును 07.10.2024 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యా సమితి వెల్లడించింది. ఆసక్తి గల తల్లిదండ్రులు, లేదా గార్డియన్స్ https://navodaya.gov.in/ లేదా https://cbseitms.rcil.gov.in/nvs/ వెబ్సైట్ ల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
రెండు రోజులు కరెక్షన్ కు అవకాశం
జేఎన్వీఎస్టీ 2025 () రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత, అధికారిక వెబ్ సైట్లో కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. జెండర్, కేటగిరీ (జనరల్/ ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ), ఏరియా (రూరల్/ అర్బన్), వైకల్యం, పరీక్షా మాధ్యమం తదితర విభాగాల్లో తమ వివరాల్లో తప్పులేమైనా ఉంటే, మార్పులు చేయాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోని కరెక్షన్ విండో ద్వారా సరి చేసుకోవచ్చు. ఈ కరెక్షన్ విండో ఆన్ లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్ణయించిన చివరి తేదీ ముగిసిన తర్వాత రోజు ఓపెన్ అవుతుంది. ఇది రెండు రోజుల పాటు తెరిచి ఉంటుంది.
ఇలా అప్లై చేసుకోండి..
జేఎన్వీఎస్టీ 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
- NVS అధికారిక వెబ్ సైట్ navodaya.gov.in ని ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఎన్వీఎస్టీ 6వ తరగతి అడ్మిషన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ వివరాలతో అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫారం నింపాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.
ఏప్రిల్ లో ప్రవేశ పరీక్ష
2025-26 విద్యాసంవత్సరానికి జేఎన్వీ (Jawahar Navodaya Vidyalaya) ల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి జేఎన్వీ సెలక్షన్ టెస్ట్ రెండు దశల్లో జరుగుతుందని, మొదటి పరీక్ష 2025 ఏప్రిల్ 12న, రెండో పరీక్ష 2025 జనవరి 18న జరుగుతుందని నవోదయ విద్యాలయ సమితి తెలిపింది.