TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులు జారీపై బిగ్ అప్డేట్, అక్టోబర్ నుంచి అప్లికేషన్లు స్వీకరణ
TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. త్వరలోనే విధివిధానాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
TG New Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని, దీనికి సంబంధించిన నిబంధనలు, విధి విధానాలపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
నెలాఖరు లోపు తుది ప్రక్రియ
వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డుల జారీపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయన్నారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు.
అర్హులందరికీ రేషన్, హెల్త్ కార్డులు
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. వైట్ రేషన్ కార్డులకు ఎవరు అర్హులనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి నిబంధనలు ఎలా ఉండాలని రాజకీయ పార్టీలకు లేఖ రాశామన్నారు. కొన్ని పార్టీలు సూచనలు చేశాయన్నారు. ఇలా వచ్చిన సూచనలపై సమావేశంలో చర్చించామన్నారు. తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం రేషన్ కార్డులపై ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందన్నారు. అవి కూడా ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అక్టోబర్ లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సంబంధిత కథనం