TG Ration cards: డూప్లికేట్ కార్డులు ఏరివేసిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు..సివిల్ సప్లైస్ శాఖ కీలక నిర్ణయం
TG Ration cards:డూప్లికేట్ రేషన్ కార్డుల ఏరివేతతో పాటు యూనిట్లను తొలగించిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.అందుకు మార్గదర్శకాలను సంబందిత అధికారులకు ప్రభుత్వం నిర్దేశించింది. ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.దీంతో కొత్త కార్డుల జారీలో మరికొన్నాళ్లు ఆలస్యం కానుంది
TG Ration cards: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి స్కీమ్ కు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లింక్ పెట్టడంతో రేషన్ కార్డు లేని వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. లబ్ధిదారులుగా గుర్తింపు పొందక అయోమయంలో ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రేషన్ కార్డు ప్రామాణికం కాదంటూనే కొత్త రేషన్ కార్డులు త్వరలో ఇస్తామని ప్రకటిస్తుంది. అయితే ఆ రేషన్ కార్డుల ప్రక్రియ ఒక ప్రహసంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. బోగస్ యూనిట్లు, కార్డులు తొలగించి నిర్దిష్టమైన కార్డులను కొనసాగిస్తూ కొత్త కార్డులు జారీ చేయనున్నారు.
రేషన్ దుకాణం వారీగా ఏరివేత ప్రారంభం కానుండగా నేడో రేపో పౌరసరఫరాల అధికారులు డీలర్లతో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను వివరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సమయంలోగా ఏరివేతను పూర్తి చేసి కొత్త కార్డులు జారీ చేసే అవకాశముంది. యుద్ధ ప్రతిపాదికన చర్యలుంటేనే సాధ్యమవుతుండగా తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రేషన్ దుకాణం వారీగా ప్రక్రియ..
కరీంనగర్ జిల్లాలో 566 రేషన్ దుకాణాలు, 2.74లక్షల కార్డు దారులు, 8.17లక్షల యూనిట్లున్నాయి. గతంలో 487 రేషన్ దుకాణాలుండగా కొత్తగా 79 ఏర్పాటు చేశారు. కార్డులు, యూనిట్ల ఏరివేతను రేషన్ డీలర్ పరిధిలో చేపట్టనున్నారు. రేషన్ డీలర్లు ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్(ఇ-పాస్) ద్వారా రేషన్ సరుకులను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు.
డూప్లికేట్ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈకేవైసీ) చేపట్టనున్నారు. అందుకు ఇ-పాస్ మిషన్లోనే ప్రత్యేక సాప్ట్ వేర్ అనుసంధానించనున్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యం తీసుకోవాలంటే వేలిముద్ర వేస్తున్నట్లుగానే, రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్ర వేయాలి.
కార్డులో ఎంత మంది ఉంటే అంతమంది వేలిముద్ర వేయాల్సిందే. ఒకవేళ వేలిముద్ర పడకుంటే ఐరిస్ ద్వారా నిర్దారించనున్నారు. సదరు ప్రక్రియలో పాల్గొనకుంటే కార్డును రద్దు చేయనున్నారు. కుటుంబసభ్యులు వేలిముద్ర వేయకుంటే వారి పేరును కార్డు నుంచి తొలగించనున్నారని సమాచారం.
త్వరలో కొత్త కార్డులు ఉత్త ప్రచారమే...
ప్రభుత్వం పలుమార్లు బోగస్ కార్డుల ఏరివేత చేపట్టింది. 2018లో రెవెన్యూ, రేషన్ డీలర్లు సంయుక్తంగా ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. అనంతరం 2020లో రేషన్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేపట్టడంతో బోగస్ కార్డులను తొలగించారు. ఇందులో ఉద్యోగులూ ఉండటం విశేషం. 2016లోనూ 777 మంది ఉద్యోగుల కార్డులను తొలగించారు.
సాంకేతిక పరిజ్ఞానం అనర్హులను పట్టిస్తుండగా తాజాగా ఇ-పాస్తో వేలిముద్రల ద్వారా నిర్ధారణ చేయనున్నారు. డి డూప్లికేట్ తరువాతే కొత్త కార్డులు ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండగా అదంతా తప్పుడు ప్రచారమని అధికారులు కొట్టి పారేశారు. కాగా డి డూప్లికేట్ పూర్తయ్యాకే కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని సమాచారం. పెళ్లయిన వారితో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు, నూతనంగా జన్మించిన పిల్లలను కార్డులో చేర్చుకునేలా వెసులుబాటు కల్పించే అవకాశముంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)