Delhi rains: ఒక్క రోజు వర్షానికే నీట మునిగిన దేశ రాజధాని నగరం; పార్లమెంటుకు వెళ్లడానికి పడవ కావాలన్న ఎంపీ
Delhi rains: గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో అల్లాడిన దేశ రాజధాని నగరం ఢిల్లీని గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో రికార్ఢు స్థాయిలో 228.1 ఎంఎం వర్షపాతం నమోదైంది.
Delhi rains: గురువారం ఉదయం 8:30 గంటల నుంచి శుక్రవారం వరకు 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇందులో 148.5 మిల్లీమీటర్ల వర్షపాతం తెల్లవారుజామున 2:30 నుంచి 5:30 గంటల మధ్య కేవలం మూడు గంటల వ్యవధిలో వచ్చిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సఫ్దర్జంగ్ లోని ఢిల్లీ వాతావరణ కేంద్రంలో ఈ వర్షపాత వివరాలు నమోదయ్యాయి. ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో లోధీ రోడ్డులో 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రిడ్జ్ 150.4 మిమీ; పాలెంలో 106.6 మిల్లీమీటర్లు, అయానగర్లో 66.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.
1936 తరువాత అత్యధికం..
గతంలో 1936 లో ఢిల్లీలో జూన్ నెలలో అత్యధికంగా 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తరువాత ఆ స్థాయిలో వర్షపాతం నమోదైంది ఇప్పుడేనని ఐఎండీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘1936 జూన్ 28న నమోదైన వర్షపాతం ఢిల్లీలో జూన్ లో ఒక్కరోజులో నమోదైన అత్యధిక వర్షపాతం 235.5 మిల్లీమీటర్లు. అప్పటి నుంచి ప్రతి ఏడాది 24 గంటల వర్షపాత రికార్డులను పరిశీలిస్తున్నాం. ఆ తర్వాత ఇది రెండో అత్యధిక వర్షపాతం’’ అని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీలో చివరిసారిగా 2023 జూలై 9న 24 గంటల వ్యవధిలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నీట మునిగిన నగరం
గురువారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ నగరం జలమయమైంది. రహదారులు నీట మునిగాయి. రోడ్డు పక్కగా నిలిపిన కార్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి భారీగా నీరు చేరింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు వాహనాలు నీట మునగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గురువారం నుంచి ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనవరి 1 నుంచి జూన్ 27 వరకు సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రంలో 51.1 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది 24 గంటల్లో అత్యధికంగా 26.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు, ఢిల్లీలోకి శుక్రవారం నైరుతి రుతుపవనాల ప్రవేశించాయని ఐఎండీ శుక్రవారం ప్రకటించింది. రానున్న ఏడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
పార్లమెంటుకు వెళ్లడానికి పడవ కావాలి
ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం తన ల్యూటియన్స్ ఇంటిని ఒక అడుగు నీటిలో ముంచెత్తిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. తన నివాసం వెలుపల నీట మునిగిన ప్రాంతాల వీడియోను షేర్ చేసిన శశిథరూర్, లుటియన్స్ ఢిల్లీలోని తన ఇల్లు వరదల్లో చిక్కుకోవడం, ప్రతి గది ఒక అడుగు నీటిలో మునిగిపోయిందని వివరించారు. కార్పెట్లు, ఫర్నీచర్, నేల మీద ఉన్నవన్నీ పాడైపోయాయన్నారు. లోక్ సభకు వెళ్లడానికి తనకు పడవ అవసరమని తాను భావించానని శశి థరూర్ సరదాగా చెప్పారు. అయితే అధికారులు రోడ్లపై నుంచి నీటిని తోడి సకాలంలో తాను పార్లమెంటుకు చేరుకునేలా సహకరించారన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మురుగు కాల్వలు నీట మునిగాయని, ఎన్నిసార్లు గుర్తు చేసినా ఢిల్లీ ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వహిస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విమర్శించారు.