Noida twin towers demolished : నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. లైవ్ వీడియో
Noida twin towers demolished : నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ ముగిసింది. అన్ని జాగ్రత్తలతో అధికారులు.. నోయిడా ట్విన్ టవర్స్‌ను కూల్చివేశారు.
Noida twin towers demolished : దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ ఆదివారం ముగిసింది. భారీ పేలుడు పదార్థాలను వినియోగించిన కారణంగా ట్విన్ టవర్స్.. కొన్ని క్షణాల్లోనే పేకమేడల్లా కుప్పకూలాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ఇలా..
నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ కోసం మొత్తం మీద 3,700కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. స్తంభాలకు ఉన్న 7,000 రంధ్రాల్లో వీటిని అమర్చారు. ట్రిగ్గర్ అయిన వెంటనే.. 'వాటర్‌ఫాల్ టెక్నిక్' తరహాలో ఈ ట్విన్ టవర్స్ 9 క్షణాల్లో కుప్పకూలాయి.
అంత భారీ భవనాలు కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో దుమ్ము, ధూళి అలుముకుంది. ఇది తగ్గేందుకు 12 నిమిషాలు పడుతుందని సమాచారం. భవనాలను పేల్చివేయడంతో.. 55వేల టన్నుల చెత్త ఏర్పడుతుందని తెలుస్తోంది.
Noida twin towers : నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సమీపంలోని 7వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా.. వెంటనే స్పందించేందుకు సమీపంలో 8 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. వివిధ ఆసుపత్రుల్లో పడకలను సైతం సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, డోర్లు, కిటికీలు మూసివేయాలని, ఎన్-95 మాస్కులు వినియోగించాలని అధికారులు సూచనలు ఇచ్చారు.
ఎందుకు కూల్చివేశారు?
Noida twin tower demolition reason : నోయిడాలోని సూపర్‌టెక్ ఎమరాల్డ్ కోర్ట్‌లోని హౌజింగ్ సొసైటీలో.. 14 భవనాల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రతి భవనంలో 9 ఫ్లోర్లు ఉండాలన్నది అసలు ప్రాన్. దీనికి నోయిడా అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత.. ఈ 14 టవర్స్‌లో.. ప్రతిదానికి 40 ఫ్లోర్లు ఉండే విధంగా డిజైన్ని సవరించారు. అందులో భాగంగానే ప్రస్తుతం కూల్చివేసిన ట్విన్ టవర్స్‌ను కట్టేశారు.
కాగా.. ఈ వ్యవహారంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. ఆమోదించిన దాని కన్నా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని 2012లో అలహాబాద్ కోర్టుకు వెళ్లారు. అందుకు అంగీకరించిన కోర్టు.. వాటిని తొలగించాలని 2014లో సూపర్‌టెక్ గ్రూప్‌నకు తీర్పునిచ్చింది.
ఆ తీర్పును సవాలు చేస్తూ.. సూపర్‌టెక్ గ్రూప్.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నో ఏళ్ల విచారణ అనంతరం.. ఆయా భవనాలను సొంత ఖర్చులతో కూల్చివేయాలని సూపర్‌టెక్ గ్రూప్‌నకు ఆదేశాలిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.
Why twin tower Noida demolition : ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే.. ఆదివారం నోయిడా ట్విన్ టవర్స్‌ను కూల్చివేశారు అధికారులు. ఫలితంగా.. కుతుబ్ మినార్ కన్నా ఎత్తుగా ఉండే ఈ ట్విన్ టవర్స్ నెలమట్టమాయాయి. దేశ చరిత్రలోనే ఇంత ఎత్తైన భవనాలను పేల్చివేయడం ఇదే తొలిసారి.
ఇంత జరిగినా.. తమ చర్యలను సూపర్‌టెక్ సంస్థ సమర్థించుకుంది! నోయిడా అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్‌కు తగ్గట్టుగానే ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టినట్టు పేర్కొంది.
సంబంధిత కథనం