Noida Twin Towers: 9 సెకన్లలోనే ట్విన్ టవర్స్ నేలమట్టం… కౌంట్ డౌన్ షురు
noida twin towers demolition: నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం నేలమట్టం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
demolition of noida twin towers: నోయిడా ట్విన్ టవర్స్... ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సూపర్‌టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన ఈ జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో దడ మొదలైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ జంట భవనాలను ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకి కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఆ భవనాలు కేవలం 10 సెకండ్లలోపే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి.
ముఖ్య అంశాలు ఇవే:
ఈ రెండు టవర్లను 3,700 కిలోల పేలుడు పదార్థాలతో రిగ్గింగ్ చేయబడ్డాయి. స్తంభాలలోని దాదాపు 7,000 రంధ్రాలలో పేలుడు పదార్థాలను చొప్పించారు. 20,000 సర్క్యూట్లను సెట్ చేశారు. ఫలితంగా ఈ టవర్లు నేరుగా కిందికి పడిపోయేలా క్రాష్ చేశారు. ఈ ప్రక్రియను "waterfall technique" అని అంటారు.
ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ప్రకారం.. ఈ కూల్చివేత ప్రక్రియ తొమ్మిది సెకన్లలోనే జరిగిపోతుంది. దుమ్మును నియంత్రించేందుకు సుమారు 12 నిమిషాల సమయం పడుతుంది. దాదాపు 55,000 టన్నుల శిథిలాలు వస్తాయి. వీటిని క్లియర్ చేసేందుకు మూడు నెలల సమయం పట్టవచ్చు.
పేలుడు 30 మీటర్ల వ్యాసార్థంలో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలను ప్రేరేపిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
కూల్చివేతకు ముందు ఈ ప్రాంతంలోని సుమారు 7,000 మంది నివాసితులు బయటకు పంపించారు. దాదాపు 2,500 వాహనాలు ఏరియా బయట పార్క్ చేయబడ్డాయి. చుట్టుపక్కల నివాసితులు సాయంత్రం 5.30 గంటలకు తిరిగి లోపలికి అనుమతిస్తారు.
మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 సమయంలో సెక్టార్ 93Aలో జంట టవర్లకు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశారు.
రూ. 100 కోట్ల బీమా పాలసీ కింద కూల్చివేత ప్రక్రియ జరుగుతుంది. ప్రక్కనే ఉన్న భవనాలకు ఏమైనా నష్టం జరిగితే ఈ బీమా కింద కవర్ చేస్తారు. ప్రీమియం మరియు ఇతర ఖర్చులను సూపర్‌టెక్ భరించాల్సి ఉంటుంది. కూల్చివేతకు రూ. 20 కోట్ల కంటే ఎక్కువ ఖర్చవుతుంది.
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను నిర్మించింది. 2009 లో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనల విన్న సుప్రీంకోర్టు, ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది.
ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ కూల్చివేత బాధ్యతలను చేపట్టింది.
టాపిక్