Delhi Airport roof collapse: ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు కూలి ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు విమానాల రాకపోకలకు అంతరాయం
ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు కూలి ఒకరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) టెర్మినల్-1లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు పైకప్పు కొంత భాగం కూలిపోయింది. ట్యాక్సీలతో సహా కార్లపై కూలిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
ఢిల్లీలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు పైకప్పు కూలిపోయినట్లు ఫోన్ వచ్చింది. రూఫ్ షీట్ తో పాటు సపోర్ట్ బీమ్స్ కూడా కూలిపోవడంతో టెర్మినల్ లోని పికప్ అండ్ డ్రాప్ ఏరియాలో పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలికి మూడు ఫైరింజన్లను తరలించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ సంఘటన ఫలితంగా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (డిఐఎఎల్) టెర్మినల్ 1 నుండి అన్ని డిపార్చర్స్ (బయలుదేరేవి) మధ్యాహ్నం 2 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. భద్రతా చర్యగా చెక్-ఇన్ కౌంటర్లను మూసివేసింది. అయితే, టెర్మినల్ 3 మరియు టెర్మినల్ 2 నుండి బయలుదేరే మరియు వచ్చే అన్ని విమానాలు పూర్తిగా పనిచేస్తాయి. టెర్మినల్ 1 అరైవల్స్ (ఆగమనం) వద్ద ఎలాంటి అసౌకర్యం లేదు.
భారీ వర్షాల కారణంగా ఈ భాగం కూలిపోయిందని డీఐఏఎల్ తెలిపింది. ఈ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు టెర్మినల్ 1లోని పాత డిపార్చర్ ఫోర్ కోర్ట్ లోని రూప్ టాప్‌లో కొంత భాగం ఉదయం 5 గంటల సమయంలో కుప్పకూలింది. క్షతగాత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అత్యవసర సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపింది.
ఈ ఘటనను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు తెలిపారు.
'టీ1 ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నా. ఫస్ట్ రెస్పాండర్లు సైట్ వద్ద పనిచేస్తున్నారు. టీ1లో బాధిత ప్రయాణికులందరికీ సహాయం చేయాలని విమానయాన సంస్థలకు సూచించింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి' అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. పైకప్పు ఊడిపడిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. సీఐఎస్‍ఎఫ్, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయచర్యలు చేపట్టారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. టెర్మినల్-2, టెర్మినల్-3 నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రయాణం చేయలేకపోయిన ప్రయాణికులకు టిక్కెట్ ఛార్జీలు వెనక్కి ఇస్తామని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ‘ప్రయాణికుల భద్రతే మాకు ప్రధానం. మోదీ ప్రారంభించిన భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2009లో నిర్మించిన భవనం పైకప్పు మాత్రమే కూలింది. ఘటనకు సంబంధించి పూర్తి నివేదిక అందాక తదుపరి చర్యలు తీసుకుంటాం..’ అని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. (ఏజెన్సీల సమాచారంతో)