World Malaria Day 2023 : మలేరియా లక్షణాలు, నివారణ మార్గాలు-world malaria day 2023 know here malaria symptoms and prevention tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Malaria Day 2023 : మలేరియా లక్షణాలు, నివారణ మార్గాలు

World Malaria Day 2023 : మలేరియా లక్షణాలు, నివారణ మార్గాలు

HT Telugu Desk HT Telugu
Apr 25, 2023 09:37 AM IST

World Malaria Day : ప్రతీ ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహనా కల్పించడం మలేరియా దినోత్సవం ఉద్దేశం. మలేరియా అనేది దోమ కాటుతో సంక్రమిస్తుంది.

మలేరియా దినోత్సవం
మలేరియా దినోత్సవం

మలేరియా పరాన్నజీవుల వల్ల కలిగే ఒక రోగం. మనిషి రక్తంలో పరాన్నజీవులు చేరినప్పుడు మలేరియా(Malaria) సోకుతుంది. దోమలు(mosquitoes) కుట్టడం ద్వారా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. మలేరియా సోకినపుడు మనిషి చలిజ్వరంతో బాధపడతాడు. సాధారణంగా సంక్రమణ జరిగిన 10-15 రోజులలో లక్షణాలు కనిపిస్తాయి. అయితే పరాన్నజీవులు మనిషి శరీరంలో సుమారు ఒక సంవత్సరం పాటు కూడా నిద్రాణంగా ఉండే అవకాశం ఉంది.

మలేరియా సాధారణ లక్షణాలు జ్వరం, చలి, తలనొప్పి, వికారం, వాంతులు, అలసట, పొత్తికడుపు నొప్పి, వేగంగా శ్వాస తీసుకోవడం, దగ్గు మొదలైనవి. ప్రస్తుతం మలేరియాకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉంది. అయితే సమయానికి చికిత్స చేయించుకోకపోతే మలేరియా ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మలేరియా ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి గురించి సరైన అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 25న ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’గా(World Malaria Day) పాటిస్తున్నారు.

మలేరియా అనేది 'ప్లాస్మోడియం' అనే పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది మురికి నీటిలో వృద్ధి చెందే ఆడ 'అనాఫిలిస్' దోమ కుట్టడం ద్వారా మనిషికి సోకుతుంది. మలేరియా ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. కొందరిలో 10 రోజులకు లక్షణాలు కనిపిస్తే, మరికొందరిలో ఒక్కరోజులోనే కనిపిస్తాయి. మలేరియా సోకినపుడు ప్రతి వ్యక్తి శరీరం ప్రతిస్పందించే స్థాయి భిన్నంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వ్యక్తులకు మలేరియా సోకినప్పటికీ ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు, అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తికి ఇది ప్రాణాంతకం అవుతుంది.

మలేరియా కారణంగా కొంతమందిలో రక్తంలో చక్కెర లెవెల్స్(Sugar Levels) పడిపోతాయి. కిడ్నీ చెడిపోవడం జరుగుతుంది. అపస్మారక స్థితికి వెళ్లడం, ఫిట్స్ రావడం, రక్త హీనత, పసిరికలు సహా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

మలేరియా లక్షణాలు

అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం, ఆ తర్వాత చలితో గజగజ వణకడం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండటం.

జ్వరంతో పాటు చెమటలు పట్టడం, బలహీనంగా అనిపించడం.

ఒకటి, రెండు, మూడు రోజుల వరకు జ్వరం వస్తూ ఉండటం.

చికిత్స, నివారణ

కచ్చితంగా రక్త పరీక్ష చేయించుకుని, సరైన చికిత్స తీసుకోవాలి.

డాక్టర్‌ని సూచించిన ఔషధాలు తీసుకోవాలి. ఔషధాలు సరైన మోతాదులో తీసుకోకపోతే మళ్లీ మళ్లీ సంభవించే అవకాశం ఉంటుంది.

ఇంటి పరిసరాల్లో దోమలు పెరకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార నియమాలు పాటించాలి. మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం