Anushka Sharma on Virat Kohli: జ్వరంలోనూ సెంచరీ బాదాడు.. కోహ్లిపై అనుష్క పోస్ట్ వైరల్
Anushka Sharma on Virat Kohli: జ్వరంలోనూ సెంచరీ బాదాడు అంటూ కోహ్లిపై అనుష్క చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో విరాట్ టెస్టుల్లో 28వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Anushka Sharma on Virat Kohli: టెస్టు క్రికెట్ లో 1205 రోజుల తర్వాత విరాట్ కోహ్లి సెంచరీ బాదాడు. ఈ సెంచరీ అతనికే కాదు అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మూడు టెస్టుల్లో విఫలమైన తర్వాత బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై విరాట్ సెంచరీ చేస్తాడని చాలా మంది భావించారు. విరాట్ వాళ్ల ఆశలను వమ్ము చేయలేదు.
అయితే అతడీ సెంచరీని జ్వరంలోనూ సాధించాడన్న విషయం మీకు తెలుసా? నిజానికి ఇది ఎవరికీ తెలియదు. అతని భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ చేసిన పోస్ట్ ద్వారానే కోహ్లి జ్వరంతో బాధపడుతున్న విషయం తెలిసింది. అతడు 186 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. "జ్వరంలోనూ ఇంత సహనంతో ఆడటం. నన్నెప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటావ్" అంటూ కోహ్లి ఫొటోను షేర్ చేసింది.
ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు
ఆస్ట్రేలియాపై 2018, డిసెంబర్ తర్వాత కోహ్లి చేసిన తొలి సెంచరీ ఇదే. అయితే ఈ ఇన్నింగ్స్ లోనే అతడు కంగారూలపై తన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా సాధించాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించినా.. 186 పరుగుల దగ్గర చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాపై కోహ్లికి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. 364 బంతులపాటు ఎంతో ఓపిగ్గా ఆడిన విరాట్ 15 ఫోర్లతో 186 రన్స్ చేశాడు.
నిజానికి ఎంతో దూకుడుగా ఆడే కోహ్లి.. మూడంకెల స్కోరు చేరుకునే వరకూ కూడా కేవలం 5 ఫోర్లు మాత్రమే కొట్టాడు. సెంచరీ తర్వాతే కాస్త దూకుడు పెంచాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో విరాట్ 169 రన్స్ చేయగా.. ఇప్పుడు దానిని అధిగమించాడు. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కోహ్లిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
నాలుగు మ్యాచ్ లలో కలిపి అతడు 49.5 సగటుతో 297 రన్స్ చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కు ఇది 75వ సెంచరీ. స్వదేశంలో టెస్టుల్లో అతనికిది 14వ సెంచరీ. స్వదేశంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వారిలో అజారుద్దీన్, సెహ్వాగ్, దిలీప్ వెంగ్‌సర్కార్ లాంటి వాళ్లను కోహ్లి వెనక్కి నెట్టాడు.
సంబంధిత కథనం