Kohli Century: 1204 రోజుల తర్వాత టెస్ట్ సెంచరీ.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై.. కోహ్లి రికార్డులు-kohli century after 1204 days in test cricket and his first against australia in 10 years at home ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Century: 1204 రోజుల తర్వాత టెస్ట్ సెంచరీ.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై.. కోహ్లి రికార్డులు

Kohli Century: 1204 రోజుల తర్వాత టెస్ట్ సెంచరీ.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై.. కోహ్లి రికార్డులు

Hari Prasad S HT Telugu
Mar 12, 2023 02:38 PM IST

Kohli Century: 1204 రోజుల తర్వాత టెస్ట్ సెంచరీ.. పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై స్వదేశంలో సెంచరీ. ఒక్క సెంచరీతో విరాట్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. అవేంటో చూద్దాం.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (PTI)

Kohli Century: విరాట్ కోహ్లి టెస్టుల్లో మొత్తానికి 28వ సెంచరీ చేశాడు. ఆదివారం (మార్చి 12) ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో 2019, నవంబర్ తర్వాత విరాట్ చేసిన తొలి సెంచరీ ఇదే కావడం విశేషం. మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్ లోనూ సెంచరీ చేయలేకపోయిన విరాట్.. గతేడాది ఆసియా కప్ లో ఆ కరవు తీర్చుకున్నాడు.

ఆ తర్వాత వన్డేల్లో మరో మూడు సెంచరీలు బాదాడు. అయితే టెస్ట్ క్రికెట్ లో మాత్రం అది ఊరిస్తూ వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు ఆడినా.. సెంచరీ ముచ్చట తీరలేదు. మొత్తానికి నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి సెంచరీ చేశాడు. ఈ సెంచరీలో పలు విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1204 రోజుల తర్వాత టెస్ట్ సెంచరీ

టెస్టుల్లో విరాట్ ఏకంగా 1204 రోజుల తర్వాత సెంచరీ చేశాడు. 2019 వరకూ టాప్ ఫామ్ లో ఉన్న అతడు.. 2020, 2021లలో ఏ ఫార్మాట్ లోనూ సెంచరీ చేయలేకపోయాడు. 2022లో వన్డేలు, టీ20ల్లో కలిపి నాలుగు సెంచరీలు చేసినా.. టెస్టుల్లో ఆ ముచ్చట తీర్చుకోలేకపోయాడు. 2019, నవంబర్ తర్వాత మళ్లీ ఇప్పుడే అంటే 1204 రోజుల తర్వాత ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో టెస్టు శతకం సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇది అతనికి 75వ సెంచరీ.

23 మ్యాచ్ లు, 40 ఇన్నింగ్స్ తర్వాత..

టెస్టుల్లో విరాట్ కోహ్లి ఏకంగా 23 మ్యాచ్ ల పాటు సెంచరీ లేకుండా గడిపాడు. మూడంకెల స్కోర్లను మంచి నీళ్లు తాగినంత ఈజీగా చేసే కోహ్లికి ఇది చాలా ఎక్కువ సమయమే. 2019, నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన డేనైట్ టెస్టులో తన 27వ టెస్ట్ సెంచరీ చేసిన అతడు.. మొత్తానికి మళ్లీ ఇన్నాళ్లకు 28వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇక టెస్టుల్లో 40 ఇన్నింగ్స్ లో విరాట్ కు ఇదే తొలి సెంచరీ. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో అతడు దగ్గరగా వచ్చినా మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు. ఆ మ్యాచ్ లో అతడు 79 రన్స్ చేశాడు. ఈ మూడేళ్ల మూడు నెలల్లో విరాట్ కేవలం ఆరు హాఫ్ సెంచరీలు చేయగలిగాడు.

పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై..

స్వదేశంలో ఆస్ట్రేలియాపై పదేళ్ల తర్వాత విరాట్ కోహ్లి టెస్ట్ సెంచరీ చేయడం విశేషం. చివరిసారి 2013, ఫిబ్రవరిలో చెన్నై టెస్టులో కోహ్లి ఆస్ట్రేలియాపై మూడంకెల స్కోరు చేశాడు. ఆ మ్యాచ్ లో 107 రన్స్ చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు అహ్మదాబాద్ లో సెంచరీ అందుకోగలిగాడు.

ఇక ఓవరాల్ గా కూడా 2018, డిసెంబర్ తర్వాత ఆస్ట్రేలియాపై అతడు చేసిన తొలి సెంచరీ ఇదే. 2018-19లో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లినప్పుడు ఆ టీమ్ పై చివరిసారి విరాట్ శతకం చేశాడు. ఆ సిరీస్ రెండో టెస్టులో విరాట్ 123 రన్స్ చేశాడు.

సంబంధిత కథనం