Bangladesh vs England: వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను తొలి టీ20లో చిత్తు చేసిన బంగ్లాదేశ్
Bangladesh vs England: వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను తొలి టీ20లో చిత్తు చేసింది బంగ్లాదేశ్. గురువారం (మార్చి 9) జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లా 6 వికెట్లతో గెలవడం విశేషం.
Bangladesh vs England: టీ20ల్లో వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్. అలాంటి టీమ్ కు షాకిచ్చింది బంగ్లాదేశ్. గురువారం (మార్చి 9) జరిగిన తొలి టీ20లో విజయం సాధించి మూడు టీ20ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. నిజానికి ఇంగ్లండ్ పై టీ20ల్లో బంగ్లాదేశ్ కు ఇదే తొలి విజయం. అయితే ఈ రెండు టీమ్స్ ఈ ఫార్మాట్ లో రెండుసార్లే తలపడ్డాయి.
ఇంగ్లండ్ విసిరిన 157 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేయడం విశేషం. నజ్ముల్ హసన్ షాంటో 30 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. కెప్టెన్ షకీబుల్ హసన్ (24 బంతుల్లో 34) రాణించాడు. ప్రతి బంగ్లాదేశ్ బ్యాటర్ దూకుడుగా ఆడటంతో 18 ఓవర్లలోనే ఆ టీమ్ ఈ టార్గెట్ చేయగలిగింది.
ఇంగ్లండ్ టీమ్ లో సామ్ కరన్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి బౌలర్లు ఉన్నా.. ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోయారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 35 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 10 ఓవర్లలో 80 పరుగులు జోడించినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లంతా విఫలమవడంతో ఆ టీమ్ భారీ స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్లు ఇద్దరూ కాకుండా బెన్ డకెట్ (20) రెండంకెల స్కోరు అందుకున్నాడు. డేవిడ్ మలన్్ (4), మొయిన్ అలీ (8), సామ్ కరన్ (6) విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లు సమష్టిగా రాణించారు.
ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్ 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో గెలిచి.. సిరీస్ ఎగరేసుకుపోయినా.. మూడో వన్డేలో ఆ టీమ్ కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. ఇప్పుడు తొలి టీ20లోనూ ఇంగ్లండ్ కు అదే ఫలితం ఎదురైంది. ఈ రెండు ఫార్మాట్లలోనూ ఇంగ్లండే ఛాంపియన్ అయిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం