Ponting on Kohli: కోహ్లీ కరువులో ఉన్నాడు.. కసి తీరా కొడతాడు.. విరాట్ బ్యాటింగ్‌పై పాంటింగ్ వ్యాఖ్యలు
Ponting on Kohli: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. విరాట్ కోహ్లీ ప్రదర్శన, ఫామ్ గురించి స్పందించాడు. ప్రస్తుతం కోహ్లీ పరుగులు చేయనప్పటికీ ఆ పరిస్థితి నుంచి ఎలా పుంజుకోవాలో అతడికి బాగా తెలుసని స్పష్టం చేశాడు.
Ponting on Kohli: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టుల్లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి. మూడేళ్ల నుంచి దీర్ఘకాల ఫార్మాట్‌లో కోహ్లీ సెంచరీ నమోదు చేయలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ గతేడాది జరిగిన ఆసియా కప్‌తో ఆ ఆశ తీర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అతడు ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 111 పరుగులే చేశాడు. తాజాగా కోహ్లీ గురించి రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి గడ్డు కాలంలో ఛాంపియన్ ఆటగాళ్లు ఎప్పుడూ ఏదోక మార్గాన్ని అన్వేషిస్తారని, త్వరలోనే కోహ్లీ కూడా పుంజుకుంటాడని స్పష్టం చేశాడు.
కోహ్లీ విషయంలో నేను పదే పదే ఒకే విషయం చెబుతాను. ఛాంపియన్ ప్లేయర్లు ఎల్లప్పుడూ ఇలాంటి సమయాల్లో ఏదోక మార్గాన్ని అన్వేషిస్తారు. ప్రస్తుతం అతడు పరుగుల కరువులో ఉన్నాడు. పెద్ద స్కోర్లు చేయకపోవచ్చు. కానీ త్వరలోనే అతడు పుంజుకుంటాడని ఆశించాలి. కోహ్లీ వాస్తవాన్ని అర్థం చేసుకుంటాడనుకుంటున్నా. ఏ బ్యాటరైన పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ విషయం గురించి వారికి అర్థమయ్యే ఉంటుంది. అయితే కోహ్లీ విషయంలో నేను ఎలాంటి ఆందోళన చెందను. అతడు తిరిగి పుంజుకుంటాడనే నమ్మకంతో ఉన్నాను. అని రికీ పాంటింగ్ స్పష్టం చేశాడు.
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ప్రదర్శన చూసి ఏ బ్యాటర్ నైపుణ్యాన్ని అంత సులభంగా అంచనా వేయలేమని పాంటింగ్ తెలిపాడు.
"ఈ సిరీస్ చూసి నేను ఎవరి ఫామ్‌పై ఓ అంచనాకు రాలేను. బ్యాటర్లకు ఈ సిరీస్ ఓ పీడకల. మొదటి రెండు టెస్టుల్లో ఓటమి నుంచి కోలుకుని మూడో టెస్టులో విజయం సాధించి ఆస్ట్రేలియా అదరగొట్టింది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని మనందరికీ తెలుసు. ఇది బంతి టర్న్ అవ్వడం వల్ల కాదు.. అకస్మాత్తుగా బంతి బౌన్స్ కావడం వికెట్‌పై నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. ఇలాంటి సమయంలో బ్యాటింగ్ చేయడం నిజంగా కష్టతరంగా ఉంటుంది." అని రికీ పాంటింగ్ అన్నాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తేడాతో ముందుంది. చివరి టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది.
సంబంధిత కథనం