Hayden on Indore Pitch: ఇలాంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్‌కు మంచిది కాదు.. ఇండోర్ పిచ్‌పై హేడెన్ సీరియస్
Hayden on Indore Pitch: ఇలాంటి పిచ్‌లు టెస్ట్ క్రికెట్‌కు మంచిది కాదు అంటూ ఇండోర్ పిచ్‌పై మండిపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్. మూడో టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.
Hayden on Indore Pitch: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో స్పిన్ ఉచ్చు బిగించి మూడు రోజుల్లోనే ముగించింది టీమిండియా. కానీ మూడో టెస్టులో ఆ స్పిన్ ఉచ్చులో తానే చిక్కుకొని విలవిల్లాడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 109 పరుగులకు చాప చుట్టేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు.
కునెమన్ 5, లయన్ 3, మర్ఫీ ఒక వికెట్ తీసుకున్నారు. తొలి రోజు తొలి సెషన్ లోనే ఇండోర్ పిచ్ స్పిన్ కు ఈ స్థాయిలో అనుకూలించడం చూసి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అసహనం వ్యక్తం చేశాడు. "స్పిన్నర్లు ఆరో ఓవర్లోనే బౌలింగ్ కు దిగడం సరి కాదు. అందుకే నాకు ఇలాంటి పిచ్ లు నచ్చవు. తొలిరోజే బంతి అసలు లేవకుండా, ఇంతలా స్పిన్ కావొద్దు. ఈ టెస్టును ఆస్ట్రేలియా గెలుస్తుందా లేక ఇండియా గెలుస్తుందా అన్నది ముఖ్యం కాదు. ఇలాంటి వికెట్లు టెస్ట్ క్రికెట్ కు మంచిది కాదు" అని కామెంట్రీలో భాగంగా హేడెన్ అన్నాడు.
"టెస్ట్ మ్యాచ్ లో నాలుగైదు రోజులు ఆడే వీలుంది. కానీ ఈ టెస్టును చూస్తుంటే అభిమానులపై జాలేస్తుంది. కనీనం నాలుగో రోజుకు కూడా వెళ్లదు" అని హేడెన్ అన్నాడు. అంతకుముందు టాస్ సందర్భంగా కూడా హేడెన్ మాట్లాడాడు. ఈ టాస్ గెలవడం ఇండియాకు కలిసొస్తుందని అన్నాడు.
"భారత అభిమానుల పరంగా చూస్తే ఈ టాస్ గెలవడం వాళ్లకు కలిసొస్తుంది. పిచ్ రిపోర్ట్ సందర్భంగా మురళీ కార్తీక్ తో కలిసి అక్కడికి వెళ్లాను. చూడగానే అది మూడో రోజు పిచ్ లా అనిపించింది. చాలా చాలా పొడిగా ఉంది" అని హేడెన్ అన్నాడు. ఇండోర్ పిచ్ పై ఇండియా టాస్ గెలిచినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి మన బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. వరుసగా వికెట్లు కోల్పోతూ చివరికి 109 పరుగులకే ఆలౌటయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ (12)తోపాటు గిల్ (21), పుజారా (1), జడేజా (4), శ్రేయస్ అయ్యర్ (0), కోహ్లి (22), భరత్, అశ్విన్ అంతా విఫలమయ్యారు. తొలి టెస్ట్ జరిగిన నాగ్‌పూర్ లో బాల్ 2.5 డిగ్రీల మేర టర్న్ అయింది. ఢిల్లీలో ఇది 3.8 డిగ్రీలు ఉండగా.. ఇండోర్ లో ఏకంగా 4.8 డిగ్రీలు ఉండటంపై హేడెన్ అసహనం వ్యక్తం చేశాడు.
"ఇలాంటి కండిషన్స్ తో ఇదే సమస్య. ఆరో ఓవర్లో ఓ స్పిన్నర్ బౌలింగ్ చేయడమేంటి. 4.8 డిగ్రీలు అంటే చాలా ఎక్కువ టర్న్. అది మూడో రోజు ఉండాల్సిన టర్న్. తొలి రెండు రోజులు బ్యాటర్లకు కాస్త అవకాశం ఇవ్వాలి కదా" అని హేడెన్ అన్నాడు.
సంబంధిత కథనం