Steve Smith Captaincy: అప్పుడు రహానే.. ఇప్పుడు స్మిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టాండిన్ కెప్టెన్ల హవా-steve smith captaincy impressed like ajinkya rahanes in 2021 australia tour ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Steve Smith Captaincy Impressed Like Ajinkya Rahanes In 2021 Australia Tour

Steve Smith Captaincy: అప్పుడు రహానే.. ఇప్పుడు స్మిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టాండిన్ కెప్టెన్ల హవా

Hari Prasad S HT Telugu
Mar 03, 2023 04:19 PM IST

Steve Smith Captaincy: అప్పుడు రహానే.. ఇప్పుడు స్మిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టాండిన్ కెప్టెన్ల హవా నడుస్తోంది. అసలు కెప్టెన్లు ఏదో ఒక కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న తర్వాత ఈ ఇద్దరు కెప్టెన్లు వచ్చి టీమ్స్ రాత మార్చారు.

స్మిత్ స్ఫూర్తిదాయక కెప్టెన్సీ
స్మిత్ స్ఫూర్తిదాయక కెప్టెన్సీ (AP)

Steve Smith Captaincy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అసలు కెప్టెన్ల కంటే స్టాండిన్ కెప్టెన్లకే బాగా కలిసొచ్చేలా ఉంది. 2020-21లో ఆస్ట్రేలియా టూర్ కు ఇండియా వెళ్లినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులకే కుప్పకూలి.. పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమిండియా నుంచి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి ఇండియాకు వచ్చేశాడు. ఇక ఆస్ట్రేలియా వైట్ వాష్ చేయడం ఖాయమని అక్కడి మాజీలు జోస్యం చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

అలాంటి సమయంలో తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానే.. రెండో టెస్టులో సెంచరీ చేసి మరీ టీమ్ ను గెలిపించాడు. ఆ తర్వాత మూడో టెస్ట్ డ్రా కాగా.. నాలుగో టెస్టులోనూ గెలిచి ఇండియా 2-1తో చారిత్రక విజయం సాధించింది. ఇదంతా స్టాండిన్ కెప్టెన్ గా ఉన్న రహానే సారథ్యంలోనే జరిగింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకు కూడా అలాగే జరిగింది.

కమిన్స్ పోయి స్మిత్ వచ్చె..

తొలి రెండు టెస్టుల్లో రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియా టీమ్ దారుణంగా ఓడిపోయింది. ఆ రెండు మ్యాచ్ లూ మూడు రోజుల్లోనే ముగిశాయి. ఇక ఆస్ట్రేలియాకు క్లీన్ స్వీప్ తప్పదని ఇప్పుడూ మాజీ క్రికెటర్లు చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ చేపట్టిన స్టీవ్ స్మిత్ ఇండోర్ టెస్ట్ లో అద్భుతమే చేశాడు. ఇండియన్ టీమ్ ను అదే మూడు రోజుల్లోనే ఓడించి దెబ్బకు దెబ్బ తీశాడు.

దాదాపు అప్పుడు ఇండియా, ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి ఒకేలా ఉంది. అప్పట్లో కీలకమైన ప్లేయర్స్ కు వరుస గాయాలు టీమిండియాను వేధించాయి. ఒక దశలో తుది 11 మందిని దించడానికైనా అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వార్నర్, హేజిల్‌వుడ్, కమిన్స్ లాంటి వాళ్ల సేవలను కోల్పోయింది.

స్ఫూర్తిదాయకంగా స్మిత్ కెప్టెన్సీ

అయినా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో, స్పిన్ కు విపరీతంగా అనుకూలించిన కండిషన్స్ లోనూ ఆస్ట్రేలియాను గెలిపించాడు స్టీవ్ స్మిత్. ఈ మ్యాచ్ లో అతని కెప్టెన్సీ మాజీ క్రికెటర్లను ఆకట్టుకుంది. 2017లో స్మిత్ కెప్టెన్సీలోనే భారత గడ్డపై 1-2 తేడాతో ఆస్ట్రేలియా సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా తమ స్వదేశంలోనూ వరుసగా రెండు సిరీస్ లను ఇండియాకు సమర్పించుకుంది.

ఇప్పుడు కూడా సిరీస్ గెలిచే అవకాశం లేకపోయినా.. నాలుగో టెస్టులో గెలిస్తే సిరీస్ డ్రా చేసుకునే అవకాశం ఆస్ట్రేలియాకు ఉంది. అంతేకాదు అహ్మదాబాద్ టెస్ట్ లో ఆస్ట్రేలియా గెలిస్తే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు కూడా సంక్లిష్టం అవుతాయి. ఆరేళ్ల కిందట ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ ఇప్పుడు స్మిత్ కు దక్కింది.

స్మిత్‌కు కాస్త అనుకూల పరిస్థితులు

నిజానికి అప్పటి రహానే పరిస్థితితో పోలిస్తే స్మిత్ కు కాస్త మెరుగైన పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యంగా ప్లేయర్స్ గాయాల సంగతి చూస్తే.. అప్పుడు రహానేకు తుది జట్టు కోసం కూడా మొత్తం 11 మంది ప్లేయర్స్ ను ఎంపిక చేసే పరిస్థితి లేదు. పైగా అందరూ యువ ఆటగాళ్లే ఉన్నారు.

కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాలో మాత్రం మూడో టెస్టుకు స్టార్క్, గ్రీన్ లాంటి స్టార్ ప్లేయర్స్ తిరిగి వచ్చారు. బ్యాటింగ్ లో స్మిత్ తోపాటు ఖవాజా, లబుషేన్ లాంటి వాళ్లు ఉన్నారు. లయన్ రూపంలో సీనియర్ స్పిన్నర్ ఉన్నాడు. ఏది ఏమైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత రెండు సిరీస్ ల నుంచి స్టాండిన్ కెప్టెన్లకే అనుకూలమైన ఫలితాలు వస్తుండటం మాత్రం విశేషమే.

WhatsApp channel

సంబంధిత కథనం