Saturday Motivation : మనిషిగా పుట్టడమే అద్భుతం.. బతికి ఉండటం అదృష్టం
Saturday Vibes : ఛీ.. జీవితం.. చచ్చిపోవాలనిపిస్తోంది.. ఏం జీవితంరా బాబు.. ఎప్పుడూ కష్టాలే. ఇలానే కదా మీరు అప్పుడప్పుడు ఆలోచించేది. కానీ మనిషిగా పుట్టడం అనేది ఓ అద్భుతం. దాన్ని ఆస్వాదించాలి. అనవసరమైన ఒత్తిళ్లతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
కొంతమందిని చూస్తుంటే.. జాలేస్తుంది. చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక జీవితంలో ఏం చేసినా.. ఇంతేనని డిప్రేషన్ లోకి వెళ్లిపోతుంటారు. కానీ మీరు ఆలోచించేది తప్పు. మనిషి జీవితం అనేది.. ప్రకృతిలో ఓ అద్భుతం.. ఎంతో ఆస్వాదించొచ్చు. చిన్న విషయాలకే కుంగిపోతే.. ఎలా? చూడాల్సింది.. చాలా ఉంది. అన్నీ సరిగా ఉన్న మనం మాత్రం.. లేనిపోని ఆలోచనలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఓ వ్యక్తి ఏళ్లపాటు.. వీల్ చైర్ లోనే ఉండి.. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించారు. ఆయన ఎవరో కాదు.. స్టీఫెన్ హాకింగ్.. ఓ గొప్ప శాస్త్రవేత్త.
స్టీఫెన్ హాకింగ్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. ఆయన ఉన్న పరిస్థితుల్లో మరో వ్యక్తి ఉంటే ఎప్పుడో కుప్పకూలిపోయేవాడు. ఆయన తన ధైర్యంతో మనుగడ సాగించడమే కాకుండా ప్రపంచం మర్చిపోలేని పరిశోధనలు చేశారు. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా.. ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేసి విశ్వవిఖ్యాతి గడించారు. విధి వెక్కిరిస్తున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు.
సైద్దాంతిక భౌతిక శాస్త్రవేత్త అయిన స్టీఫెన్ హాకింగ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. ఆయన ప్రతిపాదించిన బ్లాక్ హోల్స్ రేడియేషన్‌ను హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తుంటాం. తన గణితశాస్త్ర ఉపాధ్యాయుడి ప్రేరణతో స్టీపెన్ హాకింగ్ గణిత శాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ తండ్రి ఆయనను రసాయనశాస్త్ర విభాగంలో చేర్చేశారు. 1959లో నేచురల్ సైన్స్ విద్యాభ్యాసానికి స్కాలర్ షిప్ పరీక్ష రాశారు హాకింగ్. అందులో ఉత్తీర్ణులయ్యారు. భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశారు. కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్లారు.
అక్కడ చేరిన తర్వాత.. స్టీఫెన్ పరిస్థితి.. మారిపోయింది. ఆరోగ్య పాడైంది. భోజనం చేయడానికి గానీ, బూట్ల లేసులు కట్టుకునేందుకు గానీ శరీరం సహకరించకుండా పోయింది. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు. ఆయనకు మోటార్ న్యూరాన్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నట్టుగా తేలింది. అదే Amyotrophic Lateral Sclerosis (ALS)వ్యాధి అని కూడా అంటారు. ఆయనకు సోకిన వ్యాధితో.. నాడీమండలంపై ప్రభావం చూపిస్తుంది. అంటే నరాలు, వెన్నుపూసలపై ప్రభావం చూపుతుంది. త్వరలో ఆయన మరణిస్తారని.. అనుకున్నారంతా.. కానీ ఆయన మళ్లి తిరిగి వచ్చారు. చాలా ఏళ్లపాటు ఆయన.. వీల్ చైర్లోనే ఉన్నారు. కానీ పరిశోధనలు మాత్రం ఆపలేదు. గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు.
ఆయన చెప్పిన మాటలు ఏంటంటే.. మరణం తర్వాత.. జీవితం లేదు. స్వర్గం ఓ కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం, నరకం వంటివేమి ఉండవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం.. అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పనిచేయడం ఆగిపోయినట్టే.. మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు ఆగిపోయిన తర్వాత ఏమీ మిగలదు. కన్నుమూసేలోపు.. మనకు ఉన్న శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ.. మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నంతంగా ఉండేందుకు పాటుపడాలి.
మనిషిగా పుట్టడమే అద్భుతం..
బతికి ఉండటమే అదృష్టం..
కష్టం గురించి చింతించక..
ఉన్నన్నాళ్లు ఆనందంగా గడిపేసేయ్..