World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య
World lupus day 2024: లూపస్ పేరు వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది, కానీ ఈ వ్యాధి వస్తే మాత్రం భరించడం చాలా కష్టం. ఇది మన శరీరంలో చర్మం దగ్గర నుంచి గుండె వరకు అన్ని అవయవాల పైన దాడి చేస్తుంది.
World lupus day 2024: ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని ప్రతి ఏటా మే 10 వ తారీఖున నిర్వహించుకుంటారు. ఇలా ఒక వ్యాధి గురించి ప్రత్యేక దినోత్సవాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు. నిజానికి లూపస్ వ్యాధి గురించి ఎక్కువమందికి అవగాహన లేదు. దీని గురించి తెలుసుకుంటే వైద్యశాస్త్రాన్నే తెలుసుకున్నట్టు అని వైద్య విద్యార్థులకు చెబుతూ ఉంటారు. ఈ లూపస్ వ్యాధి ఎంత భయంకరమైనదంటే ఒక్కసారి వస్తే మన శరీరంలోని అన్ని అవయవాల పైన దాడి చేస్తుంది. చర్మం, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు... ఇలా ఏ అవయవాన్ని వదలదు. అందుకే లూపస్ గురించి ప్రజల్లో అవగాహన అవసరమని భావించి, అందుకోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ఏమిటీ లూపస్ వ్యాధి?
ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. లూపస్ ఒక విచిత్రమైన వ్యాధి. మన శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ నిత్యం మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. బయట నుంచి సూక్ష్మక్రిములు బ్యాక్టీరియాలు, వైరస్‌లు వంటివి ప్రవేశించినప్పుడు యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి, వాటిపైన దాడి చేస్తుంది. వాటిని నిర్వీర్యం చేసి శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. కానీ లూపస్ వ్యాధిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ సొంత శరీరం పైనే దాడి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేసిన యాంటీ బాడీలు మన శరీర కణజాలం మీదే దాడి చేస్తాయి. అందుకే ఇదొక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా చెప్పుకుంటారు.
లూపస్ ఏదో ఒక శరీర భాగానికి పరిమితం అయిపోదు. శరీరంలోని అన్ని అవయవాల పైనా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. లూపస్ సోకిన వారి ముఖంపై సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు వస్తాయి. ఆ దద్దుర్లు తోడేలు ముఖంపై వచ్చిన మరకల్లా కనిపిస్తాయి. అందుకే ఈ వ్యాధికి లూపస్ అని పేరు పెట్టారు. లూపస్ అంటే లాటిన్ భాషలో తోడేలు అని అర్థం.
లూపస్ వ్యాధి సోకిన వెంటనే అది బయటపడదు. వ్యక్తులు ఆరోగ్యంగానే కనిపిస్తారు. కనీసం మూడేళ్ల పాటు లక్షణాలు బయటపడడానికి సమయం పడుతుంది. నీరసంగా అనిపించడం, జ్వరం లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయి. ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తారు. ఇన్ఫెక్షన్ బారిన పడ్డామని అనుకుంటారు. లూపస్ చేయాల్సిన పని చేస్తూనే ఉంటుంది. లూపస్ ఉందని తెలిసేసరికే కొందరికి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటివి దెబ్బతింటాయి. అందుకే ఇది ప్రాణాంతకమైన వ్యాధిగానే చెప్పుకోవాలి.
లూపస్ ఎందుకు వస్తుంది?
ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇప్పటివరకు వైద్యులు చెప్పలేకపోతున్నారు. జన్యువుల్లో మార్పులు కారణం కావచ్చని భావిస్తున్నారు. అలాగే మానసిక ఒత్తిడి, అతినీలలోహిత కాంతి, జన్యువుల్లో చేరిన కొన్ని ఇన్ఫెక్షన్ కారకాలు కూడా లూపస్ రావడానికి దోహదపడతాయని అంటారు. అయితే లూపస్ బారిన పడేది అధికంగా మహిళలే. అది కూడా 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వయసు మధ్య వారే.
లూపస్ లక్షణాలు
లూపస్ వ్యాధి సోకిన వారిలో జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఎండలోకి వెళ్లినప్పుడు ఆ వేడికి చెంపలపైన సీతాకోకచిలుక ఆకారంలో దద్దుర్లు వస్తాయి. అక్కడ చర్మం కందినట్టు అవుతుంది. చెవులు, మెడ, వీపుపై కూడా మచ్చలు ఏర్పడతాయి. నాలుక మీద, అంగిలిపైనా, బుగ్గల లోపలి భాగంలో కూడా పుండ్లు వస్తూపోతూ ఉంటాయి. ఎలాంటి కారణం లేకుండా జ్వరం వచ్చిపోతూ ఉంటుంది. తీవ్రంగా నీరసంగా అనిపిస్తుంది. కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. తలనొప్పి రావడం, మైగ్రేన్ వంటి తలనొప్పులు రావడం జరుగుతుంది. చల్లటి వాతావరణంలో చేతి, కాలి వేళ్లు నీలం రంగులోకి మారతాయి. లేదా ఎర్రగా అవుతాయి. ఇవన్నీ కూడా లూపర్స్ లక్షణాలే. ఈ లక్షణాలు బయటపడడానికే చాలా సమయం తీసుకుంటుంది.
లూపస్ చికిత్స
లూపస్ వ్యాధి బయటపడ్డాక కొన్ని రకాల మందులు వాడడం ద్వారా దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. జబ్బు తీవ్రంగా మారే వరకు ఉంటే మాత్రం ప్రాణాలు నిలవడం కష్టంగా మారవచ్చు. అయితే లూపస్ ఉన్నా కూడా మందులు వాడుతూ ... ఉద్యోగాలు చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటివి చేయవచ్చు. అయితే మందుల్ని మాత్రం ఆపకూడదు. స్టెరాయిడ్ మందులు కూడా దీనికి అందిస్తారు. అలాగే థెరపీలను చేస్తారు.
గుండె, కిడ్నీలు వంటి వాటిపై లూపస్ దాడి చేస్తే చికిత్స ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. వారికి గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కిడ్నీలు పాడవుతాయి. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గడం, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. శ్వాస ఆడక పోవడం, తీవ్రంగా దగ్గు రావడం వంటివి కూడా లూపస్ లక్షణాలే.