World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?-world thalassemia day does thalassemia kill who gets it why does it come ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Thalassemia Day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

Haritha Chappa HT Telugu
May 08, 2024 07:00 AM IST

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ఇది వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా వ్యాధి గురించి మరింత తెలుసుకుందాం .

తలసేమియా వ్యాధి అంటే ఏమిటి?
తలసేమియా వ్యాధి అంటే ఏమిటి? (Pixabay)

World Thalassemia day 2024: ప్రపంచంలో ప్రాణాంతక వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వ్యాధుల్లో తలసేమియా ఒకటి. ఇది వచ్చిందంటే సాధారణ జీవితం గడపలేరు. చాలామందికి తలసేమియా వ్యాధిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. అపోహలు తీర్చేందుకే ప్రతి ఏడాది ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని మే 8 వన నిర్వహించుకుంటారు.

సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచంలో నివసిస్తున్న చిన్నారుల్లో నాలుగున్నర శాతం మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇక మన దేశం విషయానికి వస్తే మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి, అంటే వారసత్వంగా వస్తుంది.

తలసేమియా వ్యాధి అంటే ఏమిటి?

మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ నిరంతరం అందుతూనే ఉండాలి. ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందించే బాధ్యత రక్తంలో ఉన్న ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ది. ఇది ఒక రక్తపు వ్యాధి. తలసేమియా వ్యాధి ఉన్న వారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గిందో... శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ చేరడం కూడా తగ్గుతుంది. దీనివల్ల రక్తహీనత సమస్య అధికంగా వస్తుంది. తలసేమియా సమస్య ఇలాంటిదే. వీరిలో ఎర్ర రక్త కణాలు త్వరగా చనిపోతాయి. అవసరమైనంత మేరకు తయారవ్వవు. దీనివల్లే శరీరంలో రక్త శాతం తగ్గిపోతుంది.

తలసేమియా ఎందుకు వస్తుంది?

కుటుంబంలో ఎవరికైనా తలసేమియా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో జన్యుపరమైన లోపాలు ఉన్నా, జన్యువుల్లో వ్యత్యాసాలు ఉన్నా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తలసేమియాలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా తలసేమియా, రెండోది బీటా తలసేమియా.

తలసేమియా లక్షణాలు

తల్లిదండ్రులకు లేదా తాత, నానమ్మ, అమ్మమ్మలకు తలసేమియా ఉంటే వారి వారసులకు తలసేమియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటి వారు పిల్లలు పుట్టిన వెంటనే తలసేమియా పరీక్షలు నిర్వహించాలి. పిల్లల్లో మూడు నెలల నుంచి 18 నెలల వయసు మధ్య వ్యాధి బయటపడుతుంది. రక్తహీనత సమస్య వల్ల శరీర రంగు పాలిపోయినట్టు అవుతుంది. ఈ పిల్లలు శారీరకంగా ఎదగరు. అధిక రక్త కణాలు ఎక్కువగా నాశనం అయిపోతాయి. కాబట్టి పచ్చకామెర్లు వంటి వ్యాధులు వస్తాయి. వీరు నిత్యం నీరసంగా, అలసటగా ఉంటారు. వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తరచూ అనారోగ్యాలు గురవుతూ ఉంటారు. వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

చికిత్స ఉందా?

తలసేమియా వ్యాధి సోకిన వారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో ఎర్ర రక్తకణాలు త్వరగా నశించిపోతాయి. అలాంటివారికి 15 నుంచి 20 రోజులకు ఒకసారి రక్తం ఎక్కుతూ ఉంటారు. అలాగే బోన్‌మారో ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేస్తారు. ఇది చాలా ఖర్చుతో కూడకున్న పని. ఎముక మూలుగులో ఉన్న కణాలను మార్పిడి చేయడం ద్వారా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. దీనికి రక్తసంబంధీకులు కణాలను ఇవ్వాల్సి వస్తుంది. ఇది విజయవంతం అయితే జీవించే అవకాశం ఉంది.

Whats_app_banner