నెలసరి రావాల్సిన తేదీకన్నా ఒక రెండ్రెజులు దాటితే ప్రెగ్నెన్సీ గురించి సందేహం వస్తుంది. ఇది క్రమంగా ఒక తేదీ ప్రకారం పీరియడ్స్ వచ్చే వాళ్లకి. అసలు రెగ్యులర్‌గా పీరియడ్స్ రానివాళ్లు ప్రెగ్నెన్సీ నిర్ధారించుకోవడం ఎలా? దానికోసం కొన్ని లక్షణాలు గమనించుకోవాలి.
సాధారణంగా మెన్స్ట్రువల్ సైకిల్ 25 నుంచి 35 రోజుల మధ్యలో ఉంటుంది. పీరియడ్ వచ్చినప్పుడు 2 నుంచి 7 రోజుల దాకా రక్తస్రావం అవ్వొచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల, పీసీఓఎస్, హైపో థైరాయిడ్, ఒత్తిడి, బరువులో హెచ్చుతగ్గులు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లలో ఇలా జరగదు. ఒక్కోసారి రెండు నెలలు పీరియడ్స్ రావు. ఒక్కోసారి తొందరగా వచ్చేస్తాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ నెలసరి ఆధారంగా గుర్తించడం వీళ్లకి కష్టం అవుతుంది. అలాంటప్పుడు శరీరంలో వచ్చే ఈ లక్షణాల గురించి తెలిసి ఉండాలి.
ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ములో ఉబ్బినట్లు అవ్వడం, లేదా సున్నితంగా అయిపోవడం అనిపిస్తుంది. కాస్త తగలగానే నొప్పి ఉన్నట్లు, సున్నితంగా మారిపోతాయి.
ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ స్థాయుల పెరగడం వల్ల విపరీతంగా అలసట, బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. రాత్రి సరిగ్గా నిద్రపోయినా కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాస్త గమనించుకోవాలి.
ఉదయం లేవగానే కళ్లు తిరగడం, వాంతులు సాధారణ ప్రెగ్నెన్సీ లక్షణాలలో ఒకటి. గర్బం నిర్దారణ అయిన రెండు వారాలకే ఈ లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఉదయమే కాకుండా రోజులో ఎప్పుడైనా ఇలా జరగొచ్చు.
ప్రెగ్నెన్సీలో కిడ్నీలకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాలి అనిపిస్తుంది. ఇది కూడా ప్రెగ్నెన్సీ లక్షణమే అని తెల్సుకోవాల్సిందే.
హార్మోన్స్‌లో వచ్చే మార్పులు కేవలం శారీరకంగానే కాదు మానసికంగానూ ప్రభావితం చేస్తాయి. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే పీరియడ్స్ సమయంలో లాగే భావోద్వేగాలు కాస్త ఉక్కిరిబిక్కిర చేసేలా ఉంటాయి.
ఆహారం తినేటప్పుడు మీకు కాస్త తేడాగా అనిపించొచ్చు. ఇది వరకు తినేవి నచ్చవు. లేదా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. కొన్ని వాసనలు, రుచులు కొత్తగా, కొన్నిసార్లు వికారంగానూ అనిపిస్తాయి.
గర్భధారణ తర్వాత 6 నుంచి 12 రోజుల మధ్యలో కొందరిలో చాలా తక్కువ రక్తస్రావం లేదా స్పాటింగ్ కనిపిస్తుంది. ఇదే సమయంలో ఫలదీకరణ చెందిన అండం గర్భాశయ గోడకు అతుక్కుంటుంది. దీనివల్ల అలా స్పాటింగ్ కనిపిస్తుంది. పీరియడ్స్ లో అయ్యే రక్తస్రావానికి, దీనికి చాలా తేడా ఉంటుంది.
హార్మోన్ల మార్పులు వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ మందగించి బ్లోటింగ్, మలబద్దకం వస్తుంది.
క్రమంగా పీరియడ్స్ రానివాళ్లకు ఈ లక్షణాలు కాస్త ఉపయోగపడతాయి. వీటిలో ఏం అనిపించినా వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని చూడొచ్చు. శృంగారంలో పాల్గొన్న కనీసం రెండు వారాల తర్వాత టెస్ట్ చేసుకోవడం మంచిది.