చాలా మంది మహిళలు తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. నొప్పి తరచూ పెరుగుతూ ఉంటుంది. అయితే, ఇది సాధారణ మైగ్రేన్ అని అందరూ అనుకోకూడదు. ఒకవేళ కొన్ని రోజులు మాత్రమే తలనొప్పి అధికంగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించి సమస్యలను తెలుసుకోవాలి. అయితే, మహిళల్లో కొన్ని రోజులు తలనొప్పి ఎందుకు తీవ్రమవుతుందో ఎయిమ్స్ న్యూరాలాజీ డాక్టర్ ప్రియాంక షెరావత్ వెల్లడించారు.
మహిళల్లో తలనొప్పి సమస్య గురించి తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో వీడియో పోస్ట్ చేశారు ఎయిమ్స్ డాక్టర్ ప్రియాంక షెరావత్. కొన్ని టిప్స్ కూడా పంచుకున్నారు. పీరియడ్స్, హర్మోన్లు, బ్లీడింగ్ లాంటి సమస్యలకు మందులు వాడుతున్న వారికి రెండు సూచనలు చేశారు.
వాటికి మందులు తీసుకున్న తర్వాత మహిళల్లో తలనొప్పి ప్రభావం పెరిగితే.. వెంటనే గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లి.. మందుల డోస్ తగ్గించాలని అడగాలని ప్రియాంక షెరావత్ చెప్పారు. హార్మోనల్ మందులు వాడడం వల్ల మైగ్రేన్ పెరిగి తలనొప్పి అధికమయ్యే అవకాశం ఉందని అన్నారు. అందుకే ఈ మందుల వల్ల కలుగుతున్న తలనొప్పి సమస్యను డాక్టర్‌కు వివరించి.. మార్పులు అవసరం ఏమో అడగాలని సూచించారు. డోస్ తగ్గించడం వల్ల లేకపోతే మందులు మార్చడం వల్ల తలనొప్పి సమస్య తగ్గే అవకాశం ఉంటుందని ప్రియాంక షెరావత్ అన్నారు.
హర్మోనల్ మందులు తీసుకున్నాక మహిళల్లో మెదడుపై ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుందని ప్రియాంక చెప్పారు. దీనివల్ల కూడా తలనొప్పి పెరగొచ్చని అన్నారు. తలనొప్పితో పాటు కంటి చూపు కూడా మసకగా మారొచ్చని, ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. కంటి డాక్టర్ వద్దకు వెళ్లి రెటీనా చెక్ చేయించుకోవాలని సూచించారు. రెటీనా నరాలపై హర్మోనల్ మెడిసిన్స్ ఒత్తిడి పెంచుతాయని, ప్రభావం పడి ఉంటే చెకప్‍లో స్పష్టంగా తెలుస్తుందని డాక్టర్ ప్రియాంక చెప్పారు.
ఒకవేళ మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. ప్రతీ రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సరిపడా నిద్ర ఉంటే ఉపశమనం దక్కే అవకాశం ఉంటుంది. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. శరీరం హైడ్రేటెడ్‍గా ఉండేలా చూసుకోవాలి. ప్రతీ రోజు ఉదయం బ్రేక్‍ఫాస్ట్ ఒకే సమయంలో తినాలి. బ్రేక్‍ఫాస్ట్ తినకుండా ఉండకూడదు. తలనొప్పి ఉంటే ఫాస్టింగ్ లాంటివి చేయకూడదు. ఆకలిగా ఉండే నొప్పి మరింత ఎక్కువవుతుంది. పరగడుపున కాఫీ, టీ లాంటి తీసుకోవద్దు. సాయంత్రం గంటలు దాటిన తర్వాత కూడా టీ, కాఫీ తాగకూడదు. తలనొప్పి ఉంటే టీవీ, మొబైల్ ఎక్కువగా వాడకుండా.. స్క్రీన్‍టైమ్ కూడా బాగా తగ్గించేయాలి.