Morning Headaches: నిద్ర లేవగానే తలనొప్పిగా ఉంటుందా? కారణాలు, తగ్గించే మార్గాలివే
Morning Headaches: ఉదయం లేవగానే మీకు కూడా తలనొప్పి ఉంటే, ఈ నొప్పిని తగ్గించడానికి కొన్ని సలహాలు పాటించవచ్చు. అవేంటో చూడండి. ఈ తలనొప్పికి కారణాలూ తెల్సుకోండి.
తలనొప్పి ఒక సాధారణ సమస్య. కొంతమందికి ఉదయం లేవగానే ఈ సమస్య మొదలవుతుంది. ఈ సమస్య కోసం చాలా మంది మందులను ఆశ్రయిస్తారు. కానీ దానికి అసలు కారణం ఏంటో తెల్సుకునే ప్రయత్నం చేయరు. తలనొప్పితో ఉదయం లేవగానే సతమతం అవుతుంటే కొన్ని విషయాలు తప్పక తెల్సుకోవాలి. ముందుగా నిద్రలేవగానే తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.
ఉదయాన్నే తలనొప్పికి కారణాలు:
1) నిద్ర, తలనొప్పికి సంబంధం ఎక్కువే. నిద్ర తక్కువైతే తలనొప్పి ఎక్కువవుతుంది. ఒక్కోసారి నిద్ర ఎక్కువైనా తలనొప్పి రావచ్చు. కాబట్టి మీకు సరిపోయేంత నిద్ర పోవడం ముందు అలవాటు చేసుకోండి. మీ తలనొప్పికి కారణం నిద్రలేమి అయితే వెంటనే పరిష్కారం దొరికినట్లే. కొన్నిసార్లు మాత్రం మితిమీరిన నిద్ర కూడా తలనొప్పికి కారణం అవ్వొచ్చు. అదీ గమనించండి.
2) తలనొప్పికి, ఒత్తిడికీ మధ్య కూడా సంబంధం ఉంది. ఒత్తిడి వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. కాబట్టి అది మళ్లీ నేరుగా తలనొప్పికి కారణం అవుతుంది. వీటినే టెన్షన్ హెడేక్స్ అంటారు. కాబట్టి ఒత్తిడి, నిద్ర, తలనొప్పి ఒకదాంతో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఏదీ ఎక్కువా, తక్కువా కాకుండా చూసుకోవాల్సిందే.
3) స్లీప్ అప్నియా సమస్యలు ఉన్నవారు కూడా ఉదయం లేవగానే తలనొప్పితో బాధపడతారని నివేదికలు చెబుతున్నాయి.
లేవగానే వచ్చే తలనొప్పి ఎలా తగ్గించుకోవాలి?
1) ఈ సమస్య పూర్తిగా పోవాలంటే ముందు మీ నిద్రపోయే సమయానికి ఒక షెడ్యూల్ పెట్టుకోండి. కనీసం పది రోజుల పాటూ ఒకే సమయంలో పడుకోవడం, లేవడం చేస్తే దానికే అలవాటు పడతారు. ఇది మీ తలనొప్పిని తగ్గిస్తుంది.
2) మైగ్రేన్ లాంటి సమస్యలుంటే వాటిని నియంత్రణలో ఉంచేలా చికిత్సలు, మందులు వైద్య సలహాతో వాడండి.
3) ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. ఇది తలనొప్పికి కూడా కారణం అవ్వచ్చు. ఈ అలవాటుంటే దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నించండి.
4) మంచి ఆహారం తీసుకోవడంతో పాటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. రోజంతా తగినంత నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే పరగడుపున ఒక పెద్ద గ్లాసు నీరు త్రాగి మీ రోజు మొదలుపెట్టండి. నీరు తక్కువగా తాగుతున్నా అది తలనొప్పికి కారణం కావచ్చు.
మీకు అన్ని ప్రయత్నాల తర్వాత కూడా ఉపశమనం దొరక్కపోతే, ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసిన తర్వాత కూడా సమస్య అలాగే ఉంటే వైద్యుణ్ని సంప్రదించండి. నిర్లక్ష్యం చేయకండి.
టాపిక్