Bangles on seemantham: సీమంతం రోజున గర్భవతికి గాజులు వేయడానికి కారణం ఇదే-why pregnant women wear bangles on seemantham scientific reasons behind bangles ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bangles On Seemantham: సీమంతం రోజున గర్భవతికి గాజులు వేయడానికి కారణం ఇదే

Bangles on seemantham: సీమంతం రోజున గర్భవతికి గాజులు వేయడానికి కారణం ఇదే

Koutik Pranaya Sree HT Telugu
Sep 22, 2024 10:30 AM IST

Bangles on seemantham: సీమంతం రోజున గర్భవతి చేతికి చేయినిండా గాజులు తొడుగుతారు. అలాగే మామూలు సాంప్రదాయ వేడుకల్లోనూ గాజులకు ప్రాముఖ్యత ఉంటుంది. వీటి వెనక ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి తెల్సుకోండి.

సీమంతం రోజు గాజులు ఎందుకు వేస్తారు?
సీమంతం రోజు గాజులు ఎందుకు వేస్తారు?

మహిళలు గాజులు వేసుకునే సంప్రదాయం పూర్వ కాలం నుంచీ ఉంది. మహిళల జీవితంలో ముఖ్యమైన ప్రతి సందర్బంలో గాజులకు ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్లి, నిశ్చితార్థం, పూజలు, సీమంతం.. ఇలా ప్రతి వేడుకలో గాజులు ముఖ్యంగా కనిపిస్తాయి. పండుగలు, వేడుకల సమయంలో అయితే వీటిని స్త్రీలు ఇంకా ఎక్కువగా వేసుకుంటారు. వీటిని ఒక అలంకరణగా భావిస్తారు. మరి ఈ గాజుల్ని ఊరికే వేసుకుంటారా? లేదంటే అందుకు ఏమైనా సైంటిఫిక్‌ రీజన్స్‌ ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా సీమంతం సమయంలో గాజులు తొడగడానికి ప్రత్యేక కారణం ఉంది అదేంటో చూడండి.

సీమంతం రోజున గాజులెందుకు?

గర్భవతిగా ఉన్న మహిళ చివరి మూడు నెలల్లోనే సాధారణంగా సీమంతం వేడుక చేస్తారు. ఈ రోజున గర్బంతో ఉన్న మహిళ చేతికి ఆకుపచ్చ గాజులు లేదా తొమ్మిది రంగుల గాజులు తొడిగే సాంప్రదాయం చాలా చోట్ల ఉంది. ఇప్పుడు బేబీ షవర్ పేరుతో వెస్టర్న్ కల్చర్ ఫాలో అవుతున్నా.. ఈ ఏళ్ల తరబడి నుంచీ వస్తున్న సాంప్రదాయంలో మాత్రం ఎక్కువ అర్థం, ఆరోగ్య రహస్యం దాగి ఉంది.

సీమంతం రోజున చేతినిండా తొడిగిన గాజులు ప్రసవం రోజు దాకా తీయకూడదని చెబుతారు. ఇది సాంప్రదాయంగా భావిస్తున్నా కూడా దీని వెనక ఆరోగ్య రహస్యం దాగి ఉంది.

1. చేతి మణికట్టు దగ్గర గర్భాశయానికి సంబంధించిన నాడులుంటాయి. ఈ నాడుల మీద చేతికి నిండుగా తొడిగిన గాజుల ఒత్తిడి పడటం వల్ల సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

2. చేతుల నిండా గాజులుంటే గజ్జెల కన్నా ఎక్కువ శబ్దం వస్తుంది. అదెంతో వినసొంపుగానూ ఉంటుంది. ఆ మట్టి గాజుల శబ్దం వల్ల గర్భంలో ఉన్న శిశువు మెదడులోని కణజాలం వృద్ధి చెందుతుంది. వినికిడి శక్తి మీదా ప్రభావం ఉంటుంది. కడుపులో ఉన్న బిడ్డకు ఈ శబ్దాలు నచ్చుతాయట.

3. గాజుల శబ్దాల వల్ల గర్భవతులకు ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ గాజులను చూస్తే మురిపెంగా, ఆనందంగా అనిపిస్తుంది. వాటిని చూసినప్పుడల్లా ఆనందంగా అనిపిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. గర్భం దాల్చిన స్త్రీలు ఒత్తిడితో ఉంటే.. పుట్టే శిశువు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు ఉంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఈ సమస్యా గాజులు తగ్గిస్తాయి.

మహిళలకు గాజుల వల్ల ఉపయోగాలు:

సాధారణంగా కూడా మహిళలకు చేతికి గాజులు వేసుకోవడం వల్ల లాభాలుంటాయి. పూర్వ కాలంలో ఎక్కువగా బంగారు గాజులు, లేదా మట్టి గాజుల్ని వేసుకునేవారు. వీటితో మహిళల్లో ఉన్న శక్తి తత్వం ఉత్తేజితం అవుతుంది. అలాగే నెగెటివ్‌ ఎనర్జీలు దరి చేరకుండా ఉంటాయి. ఇవి వేసుకున్న వారిలో సాత్వికమైన బుద్ధి పెరుగుతుందట. గాజులు వేసుకోవడం అనేది చుట్టూ ఉండే వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. చుట్టూ ఉన్న చెడు వైబ్రేషన్స్‌ని తిప్పి కొడుతుంది. ఇదంతా లయతో కూడిన చప్పుడు వల్లే సాధ్యపడుతుంది కాబోలు.

* మహిళలు గాజుల్ని ధరించడం వల్ల మణి కట్టు దగ్గర ఉండే రక్త నాళాలపై ఒత్తిడి కలుగుతుంది. దీంతో అక్కడ ఏర్పడిన రాపిడి, ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. అందువల్ల బీపీలు, గుండె జబ్బుల్లాంటి సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి.

* గాజులు మహిళల్లోని మానసిక భావాలను ప్రభావితం చేస్తాయి. మానసిక నియంత్రణను కూడా పెంచుతాయి.

Whats_app_banner