Chickpeas: ఉడికించి, మొలకెత్తించి, వేయించి.. శనగల్ని తినడానికి మంచి పద్దతేంటో తెల్సుకోండి
Right way to eat Chickpeas: ఆరోగ్యం కోసం ఉడకబెట్టిన, కాల్చిన లేదా మొలకెత్తిన శనగల్లో ఏది తినడం ప్రయోజనకరమో తెలుసా?ఈ అయోమయం మీకూ ఉంటే మీ అవసరానికి తగ్గట్లు మీరు ఎలా తింటే మంచిదో చూడండి.
శనగలను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శనగలు తినడం ఆరోగ్యానికి ఒక వరంగా భావిస్తారు. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల శరీరంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పిండి పదార్థాలు పుష్కలంగా అందుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు 50 నుండి 60 గ్రాముల శనగలు తింటే ఆరోగ్యకరం అని చెబుతారు. కానీ, వీటిని తినడానికి సరైన మార్గం ఏంటి? ఉడకబెట్టిన, వేయించిన లేదా మొలకెత్తిన శనగల్లో వేటితో ప్రయోజనం ఎక్కువ? అవసరాల బట్టి శనగలను ఎలా తినాలో చూద్దాం.
మొలకెత్తిన శనగలు:
కాల్చిన శనగల కన్నా మొలకెత్తినవి తినడం చాలా ఆరోగ్యకరం. మొలకెత్తిన శనగల్లో నీటిలో కరిగే పీచు ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దాంతో మలబద్దకం, గ్యాస్ సమస్యలూ తగ్గుతాయి.అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో కూడా ఈ ఫైబర్ పనిచేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం హైబీపీ సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది.
వేయించిన శనగలు:
సాయంత్రం పూట ఉండే చిరు ఆకలి తీర్చడానికి వేయించిన శనగలు ఎంచుకోవచ్చు. చెప్పాలంటే పుట్నాల పప్పు రుచిలో ఉంటాయివి. కాకపోతే వీటికి పొట్టు కూడా ఉంటుంది. జలుబు, కఫంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇవి డయాబెటిస్. థైరాయిడ్ రోగులకు కూడా మంచి స్నాక్. అధిక బరువు ఉంటే, వేయించిన శనగలు తిని పెరుగుతున్న బరువును నియంత్రించవచ్చు. అయితే బరువు పెరగాలనుకునే వారు వేయించిన శనగలు తినకూడదు.
ఉడికించిన లేదా నానబెట్టిన శనగలు:
శనగలను ఉప్పు నీళ్లలో నానబెట్టి తినే అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. ముఖ్యంగా ఈ శనగల్ని ఏవైనా వ్రతాలు చేసినప్పుడు ప్రసాదంగా ఇస్తుంటారు. లేదా వీటినే ఉడికించి తింటారు. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో ప్రోటీన్ లోపాన్నీ తగ్గిస్తాయి. కండరాలను బలోపేతం చేయడం ద్వారా జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి జ్ఞాపకశక్తిని కాపాడుకోవచ్చు. శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను పెంచడం ద్వారా మంచి మెదడు పనితీరును నిర్వహించడానికి ఇది పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఏ రకంగా చూసినా, ఏ రూపంలో తిన్నా శనగల వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. కాబట్టి మీ సమస్య, అవసరాన్ని బట్టి వాటిని తినే విధానాన్ని మీరు ఎంచుకోవచ్చు.
టాపిక్