Stack cooking: ఈ టెక్నిక్‌తో ఒకేసారి నాలుగైదు వంటలన్నా వండొచ్చు.. స్టాక్ కుకింగ్‌తో వండగలిగే రెసిపీ ఐడియాలూ చూసేయండి-what is stack cooking know recipe ideas and benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stack Cooking: ఈ టెక్నిక్‌తో ఒకేసారి నాలుగైదు వంటలన్నా వండొచ్చు.. స్టాక్ కుకింగ్‌తో వండగలిగే రెసిపీ ఐడియాలూ చూసేయండి

Stack cooking: ఈ టెక్నిక్‌తో ఒకేసారి నాలుగైదు వంటలన్నా వండొచ్చు.. స్టాక్ కుకింగ్‌తో వండగలిగే రెసిపీ ఐడియాలూ చూసేయండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 19, 2024 01:30 PM IST

Stack cooking: ఒకేసారి నాలుగైదు వంటలైనా స్టాక్ కుకింగ్ పద్ధతిలో చేయొచ్చు. ఒకదాని మీద ఒక పదార్థం పేర్చి, ఉడికించి వంట చేసే విధానం ఇది. దీని ద్వారా పాత్రల సంఖ్య తగ్గుతుంది. పోషకాలు పెరుగుతాయి. స్టాక్ కుకింగ్‌తో రకరకాల వంటలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

స్టాక్ కుకింగ్
స్టాక్ కుకింగ్ (freepik)

తినడానికే సమయం ఉండట్లేదు. ఇక వంట ఎంత హడావుడిగా చేయాల్సి వస్తోందో ఆలోచించండి. ఉద్యోగం చేసే మహిళలలకైతే ఇదో పెద్ద సవాలు. అందుకే వంట సమయం తగ్గించడానికి అనేక చిట్కాలు వస్తూనే ఉంటాయి. సాంప్రదాయ వంట విధానంలో ఒక్కో వంట వండటానికి ఒక్కో పాత్ర వాడాలి. అలా రెండు మూడు వంటలు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఈ సమయాన్ని తగ్గించడానికే ఇప్పుడు స్టాక్ కుకింగ్ అనే విధానం చాలా ట్రెండ్ అవుతోంది. దీంతో ఒక్కసారే నాలుగైదు రకాల వంటలైనా చేయొచ్చు. ఆన్‌లైన్‌లో స్టాక్ కుకింగ్ కోసం అనుకూలంగా ఉండే పాత్రలూ దొరుకుతున్నాయి. 

స్టాక్ కుకింగ్ అంటే?

ఈ విధానంలో ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి స్టవ్ మీద పెడతారు. ఆ పాత్ర మధ్యలో ఒక స్టాండ్ పెట్టి మరో రెండు మూడు వంటకాలకు సంబంధించిన కూరగాయలు, పప్పులు లాంటివి వరసగా మీద పెడతారు. ఒకదాని మీద ఒకటి పెట్టి మూతపెట్టి ఉడికిస్తారు. కింద నుంచి వచ్చే ఆవిరితో మీద ఉన్న పదార్థాలు ఉడికిపోతాయి. దీంతో ఒకే సమయంలో అన్నీ ఉడికిపోతాయి. పాత్రలు కూడా ఎక్కువగా అవసరం అవ్వవు. దీనికోసం స్టీమర్ కూడా వాడొచ్చు.

లాభాలేంటి?

ప్రెజర్ కుక్కర్లో కూరగాయల్లాంటివి నీళ్లలో వేసి ఉడికిస్తే వాటి పోషకాలు వృథా అయిపోతాయి. అదే స్టాక్ కుకింగ్‌లో పోషకాల నష్టం జరగదు. అలాగే ప్రెజర్ కుక్కర్లో మెత్తగా ఉడికిపోయి వాటి అసలు రుచి కాస్త కోల్పోతాయి. స్టాక్ కుకింగ్ లో రుచి మరింత పెరుగుతుంది. ఆవిరిలో ఒకే పాత్రలో అన్నీ కలిసి ఉడకడం వల్ల వాటి రుచి చాలా బాగుంటుంది. చెప్పాలంటే ఏ మసాలాలు లేకుండా కూడా వీటితో వంట చేసేంత రుచిగా కూరగాయలు ఉడికిపోతాయి. అలాగే వంటకోసం కావాల్సిన ప్రతిదీ ముందుగానే ఉడికించుకుంటాం కాబట్టి నూనె కూడా ఎక్కువ వాడకుండా వంటకాలు చేసుకోవచ్చు.

ఎలాంటి వంటలు చేయొచ్చు?

అసలు దీన్ని ఉపయోగించి ఎలాంటి వంటలు చేయొచ్చనే సందేహం వస్తే. మీకోసం కొన్ని రెసిపీల ఉదాహరణలు ఇస్తున్నాం. వాటిని చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది.

1. పప్పు, ఆలూ బటానీ కర్రీ:

మీరు ఈ రోజు టమాటా పప్పు, పాలకూర పప్పు ఇలా ఏదైనా చేయాలనుకున్నారు. దాంతో పాటూ ఆలూ బటానీ కర్రీ కూడా చేయాలనుకున్నారు. ఇవన్నీ ఒకేసారి, ఒకే పాత్రలో అయిపోతాయి. దానికోసం ముందు వెడల్పాటి పాత్రలో కందిపప్పు, టమాటా, పచ్చిమర్చి వేసుకుని అవి మునిగే అంత నీళ్లు పోయండి. మధ్యలో చిల్లులున్న స్టాండ్ ఒకటి పెట్టండి. దాని మీద చిన్న గిన్నెల్లో ఒక దాంట్లో బంగాళదుంప ముక్కలు, మరో దాంట్లో ఎండు బటానీ, టమాటా నీళ్లు పోసి పెట్టండి. మీద మూత పెట్టి ఉడికిస్తే పావుగంటలో కూర, పప్పుకు కావాల్సినవన్నీ రెడీ అవుతాయి. తాలింపు పెట్టుకుంటే చాలు.

2. వెజ్ పులావ్, పన్నీర్ కర్రీ:

కూరగాయ ముక్కలన్నీ కలిపి మిక్స్డ్ వెజ్ పులావ్ చేయాలి కాబట్టి ముందు కిందుండే పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్, క్యారట్, ఆలూ, బటానీ లాంటి కూరగాయ ముక్కలన్నీ వేసుకోండి. అవి మునిగేదాకా నీళ్లు పోసి మీద స్టాండ్ పెట్టండి. స్టాండ్ మీద పన్నీర్ ముక్కలు, గ్రేవీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు గిన్నెలో వేసి పెట్టండి. అలాగే పులావ్ కోసం బాస్మతీ రైస్ ఒక గిన్నెలో నీళ్లు పోసి పెట్టి అందులో అనాస పువ్వు, లవంగం, యాలకులు వేసేయండి. మూత పెట్టి ఉడికిస్తే అన్నీ ఒకేసారి రెడీ అవుతాయి. అన్నం పక్కన పెట్టేసి, కూరగాయల ముక్కల్ని తాలింపు పెట్టేస్తే పులావ్ రెడీ అవుతుంది. ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టేస్తే పన్నీర్ గ్రేవీ రెడీ అవుతుంది. తక్కువ నూనెతో ఒకేసారి రుచికరమైన వంటలు రెడీ అయినట్లే.