Period Panty: పీరియడ్ ప్యాంటీలు వాడితే ప్యాడ్ అక్కర్లేదిక. ధర తక్కువ, లీకేజ్ సమస్యా ఉండదు
Period Panty: నెలసరి సమయంలో పీరియడ్ ప్యాంటీ వాడటం వల్ల సౌకర్యంగా ఉంటుంది. దీని వాడకం గురించి, ప్యాడ్ కన్నా దీన్ని వాడితే వచ్చే సౌకర్యం గురించి, లాభాల గురించి తెల్సుకోండి.
పీరియడ్స్ వస్తూనే సమస్యలను మోసుకొస్తాయి. కొందరిలో సాఫీగా నెలసరి సాగిపోయినా, కొందరికి పీరియడ్స్ వస్తాయంటేనే భయమేస్తుంటుంది. రక్తస్రావం కోసం ప్యాడ్స్ లేదా శ్యానిటరీ న్యాప్‌కిన్లు వాడటం కూడా కొంతమందికి ఇబ్బందే. దాంతో ర్యాషెస్ వస్తుంటాయి. అధిక రక్తస్రావం అయితే లీకేజీ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యలన్నీ చాలా సులువుగా తగ్గించేస్తాయి పీరియడ్ ప్యాంటీలు. వీటిని వాడితే మీకు చాలా సుఖంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రతి అమ్మాయి వీటి గురించి తెల్సుకోవాల్సిందే. మీకు తెలిసిన అమ్మాయిలకు వీటి గురించి చెప్పాల్సిందే.
పీరియడ్ ప్యాంటీలంటే?
ఇవి చూడ్డానికి సాధారణ ప్యాంటీల్లాగే ఉంటాయి. వాడటం కూడా అలాగే. కాకపోతే వీటి లోపలి వైపు నాలుగైదు పొరలుంటాయి. ఇవి యోని నుంచి వచ్చే రక్తస్రావాన్ని సులువుగా పీల్చేసుకుంటాయి. వీటి సామర్థ్యం రెండు ప్యాడ్స్‌కు సమానం. ఇక మళ్లీ ప్యాడ్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ప్యాంటీని 12 గంటల వరకు ఉంచుకోవచ్చు. వీటిని వేసుకుంటే నెలసరి విషయం కూడా మర్చిపోతారు. అంత సౌకర్యంగా ఉంటాయివి. అలాని ఉబ్బెత్తుగానూ, అసౌకర్యంగానూ అనిపించవు. ప్యాడ్ లాగా కాకుండా వీటిని ఉతికి మళ్లీ మళ్లీ వాడుకునే రీయూజబుల్ రకాలివి. వీటి ధర ఎక్కువే అయినా ఒక్కసారి కొంటే రెండు సంవత్సరాలైనా వాడుకోవచ్చు. అలా పోల్చుకుంటే మామూలు ప్యాడ్స్ కన్నా తక్కువ ధరే అవుతుంది వీటికి. వీటిలో నాణ్యత ఎక్కువున్న రకాలైతే మూడేళ్ల వరకు వాడొచ్చు.
టీనేజ్ పిల్లలకు:
తక్కువ వయసులో ఉన్న పిల్లలకు, స్కూలుకెళ్లే వాళ్లకి లీకేజీ విషయంలో చాలా ఇబ్బందులుంటాయి. స్కూళ్లలో ప్యాడ్ మార్చుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. వీళ్లకి ఈ పీరియడ్ ప్యాంటీలతో చాలా సౌకర్యం అని చెప్పొచ్చు. వీటిలో రక్త స్రావానికి తగ్గట్లు హెవీ, మీడియం, లో ఫ్లో రకాలుంటాయి. వాటిని అవసరానికి తగ్గట్లు ఎంచుకుంటే సరిపోతుంది. నెలసరి ముందునుంచి భయపడకుండా వీటిని వేసుకున్నా ఏ ఇబ్బందీ ఉండదు.
పీరియడ్ ప్యాంటీ శుభ్రపరిచే విధానం:
చాలా మంది దీంతో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని అపోహపడతారు. కానీ సరైన పద్ధతిలో వాడితే మీకూ, పర్యావరణానికి వీటివల్ల మేలు. వాడేసిన పీరియడ్ ప్యాంటీని ట్యాప్ కింద పెట్టి నీళ్ల ధార కింద ఉంచండి. తర్వాత డిటర్జెంట్ పెట్టి చేత్తో కానీ, మెషీన్ వాష్ కానీ చేయొచ్చు. తప్పకుండా ఎండలో ఆరేస్తే చాలు. మరకలు వదలకపోతే నిమ్మరసం, హైడ్రోజెన్ పెరాక్సైడ్ వాడి శుభ్రం చేస్తే సరిపోతుంది.
పీరియడ్ ప్యాంటీ లాభాలు:
- శ్యానిటరీ ప్యాడ్ కన్నా వీటిని పెట్టుకుంటే ర్యాషెస్ ఇబ్బంది ఉండదు. చాలా తేలిగ్గా అనిపిస్తాయి.
- ఎక్కువ సేపు వేసుకోవచ్చు. బాత్రూంలు అందుబాటు లేని దగ్గర ఇవి ఉత్తమ ఎంపిక
- దూర ప్రయాణాల్లో సౌకర్యం
- పర్యావరణానికి అనుకూలం
- దీర్ఘకాలంగా వాడితే ధర కూడా తక్కువే