Weekend Marriage | వారాంతపు వివాహం.. వారానికి ఒక్కసారి మాత్రమే కాపురం, ఇది మీకు తెలుసా?!
Weekend Marriage: ప్రతిరోజూ భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ, ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవడం బోర్ కొడుతుందా? పెళ్లి వల్ల స్వేచ్ఛ కోల్పోయామనే భావన మీలో ఉందా? అయితే వారాంతపు వివాహం కాన్సెప్ట్ గురించి మీకు తెలుసా?
వివాహం అయిన చాలా మంది, పెళ్లి ఎందుకు దండగ, పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటమే మేలని తరచూ చెబుతుంటారు. రోజూ సంసార సాగరం ఈదడం, బరువు బాధ్యతలు మోయడం అంత సులభమైన విషయం కాదనేది వారి వాదన, ఆవేదన. అయితే రోజూ కాకుండా భార్యాభర్తలు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే కలిసి ఉండటం. కేవలం వారాంతంలోనే కాపురం చేయడం, వారంలో ఒక్కరోజు మాత్రమే సంసార బాధ్యతలు పంచుకోవడం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఊహే ఎంత బాగుందో అనిపిస్తోందా? అయితే మీ ఊహలు నిజం చేసుకోవాలంటే మీరు వీకెండ్ మ్యారేజ్ చేసుకోవాలి. కేవలం వీకెండ్‌లో మాత్రమే మీరు భార్యాభర్తలు, మిగతా వారమంతా సోలో లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు.వారాంతపు పెళ్లిళ్ల ధోరణి ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది.
అసలు ఈ వీకెండ్ మ్యారెజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ మొదలైంది? ఎందుకు- ఏమిటి- ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం.
What Is Weekend Marriage- వారాంతపు వివాహం అంటే ఏమిటి?
వారాంతపు వివాహం అనే భావన జపాన్ దేశంలోని జంటలలో పెరుగుతున్న ధోరణి. ఇక్కడ వివాహమైన జంటలు కలిసి సమయాన్ని గడపడానికి వారాంతం వరకు వేచి ఉంటారు. ఆ వారాంతంలోనే ఇద్దరు భార్యాభర్తలుగా జీవిస్తారు, మిగతా వారమంతా ఎవరి స్వతంత్ర జీవనశైలిని వారు అనుసరిస్తారు.
ఈరోజుల్లో చాలా మంది పెళ్లైన జంటలు విడిపోవడానికి ప్రధానంగా చెప్పే కారణం, పెళ్లి తర్వాత తమ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కోల్పోయామని. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ, ఒకే ఇంట్లో కలిసి ఉండటం వలన ఏదో ఒక విషయంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి, వాటిని సర్దుకోలేకపోతున్నాం అని చెబుతున్నారు.
ఒకరి అలవాట్లు మరొకరికి నచ్చకపోవడం, ఒకరి పద్ధతులు మరొకరికి నచ్చకపోవడం వలన గొడవలు జరిగి బంధంలో చీలిక ఏర్పడుతుంది. దీనికి పరిష్కారంగానే వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్ ప్రారంభమైంది. దీనివల్ల ఎవరి లైఫ్ వారు స్వేచ్ఛగా, వారికి నచ్చినట్లుగా జీవించే అవకాశం లభిస్తుంది.
వారాంతపు వివాహాలు సంబంధాలను మెరుగుపరుస్తాయా?
జపాన్‌లో అనేక జంటలు ‘వీకెండ్ మ్యారెజ్ ట్రెండ్’ ను అనుసరించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రోజూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ, చివరకు ఇంటికి చేరగానే ఇంట్లో చికాకులు మొదలైతే అవి ఒత్తిడి, ఆందోళనలను పెంచుతున్నాయి. అయితే ఈ వీకెండ్ మ్యారేజ్ భావనలో ఉండటం వలన ప్రతిరోజూ ఇంటికి రావాల్సిన అవసరం లేదు, కనీసం ఫోన్‌లో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.
ఇది తమ అభిరుచులు, ఆసక్తులను కొనసాగించడంలో భాగస్వామి జోక్యం లేకుండా అవకాశం కల్పిస్తుంది. ఎలాంటి ఒత్తిడి, ఆధిపత్య ధోరణి లేకుండా స్వేచ్ఛగా ఉండటానికి, తమ ఎదుగుదలకు అవకాశం ఇస్తుంది.
వారాంతపు వివాహంలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వారాంతంలోనే వారి భాగస్వామిని కలుస్తారు కాబట్టి. వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నారు. వారితో కలిసి వీకెండ్ ప్లాన్స్ చేయడం, బహుమతులు కొనివ్వడం, ప్రేమగా చూసుకోవడం జరుగుతున్నాయి. అందువల్ల ఈ వీకెండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ చాలామందికి నచ్చుతుంది.
అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరికీ ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. జంటలు అద్దె లేదా బిల్లుల చెల్లింపులో ఎవరికి వారే ఖర్చుపెట్టుకోవాలి, ఎవరి పెట్టుబడుల కోసం వారే డబ్బు ఆదా చేసుకోవచ్చు. పిల్లలు ఉంటే కలిసి చెరి సగం ఖర్చులు పంచుకుంటారు.
భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా?
- భారతదేశం ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకంటే కుటుంబం, సమాజ విలువలకు ప్రాధాన్యతనిచ్చే దేశం కాబట్టి భారతదేశంలో వారాంతపు వివాహం చెడు పరిణామాలకు దారితీయవచ్చునని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
- కొంతమంది జంటలు తమ భాగస్వామి ప్రతిరోజూ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి భద్రత కూడా చూసుకోవాలి. అప్పుడు వారాంతపు వివాహం భావన చెల్లుబాటు కాదు.
- భారతదేశంలో చాలా మంది ఎంతో కష్టపడి సొంత ఇల్లు కట్టుకుంటారు, అద్దె చెల్లిస్తారు. కుటుంబం అంతా కలిసి ఒకచోట సర్దుకున్నప్పుడే ఖర్చులు అదుపులో ఉంటాయనే భావన ఉంటుంది.
- భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటే ఇక్కడ సమాజంలో వేరే అర్థాలకు దారితీస్తుంది. మూడో వ్యక్తి వారి జీవితంలో ప్రవేశించవచ్చు, కొన్నిసార్లు అనుమానాలు తీవ్రం కావచ్చు. ఇలాంటి సందర్బాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.
- శాశ్వతంగా విడిపోదాం అనుకున్న జంటలకు ఈ వారాంతపు వివాహం అనే భావన, కేవలం ఒక భాగస్వామికి మాత్రమే మేలు జరగవచ్చు.
వారాంతపు వివాహం చాలా పరిణితితో ఆలోచించే ఇద్దరి భాగస్వాముల మధ్యనే అనధికారికంగా చెల్లుబాటు కావచ్చు.
సంబంధిత కథనం