Dal Balls - Healthy Snack । దాల్ బాల్స్ ఆరోగ్యకరమైన చిరుతిండి.. బరువు తగ్గాలనుకునే వారికి మంచివి!-want eat healthy snacks try dal balls to satisfy your evening cravings recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dal Balls - Healthy Snack । దాల్ బాల్స్ ఆరోగ్యకరమైన చిరుతిండి.. బరువు తగ్గాలనుకునే వారికి మంచివి!

Dal Balls - Healthy Snack । దాల్ బాల్స్ ఆరోగ్యకరమైన చిరుతిండి.. బరువు తగ్గాలనుకునే వారికి మంచివి!

HT Telugu Desk HT Telugu
Jan 05, 2023 06:07 PM IST

Dal Balls - Healthy Snack: సాయంత్రం వేళలో నూనెలో ఫ్రై చేయని, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనుకుంటే ఈ దాల్ బాల్స్ తినిచూడండి.

Dal Balls - Healthy Snack
Dal Balls - Healthy Snack (Slurrp)

మధ్యాహ్నం భోజనానికి, రాత్రి అల్పాహారానికి మధ్య ఆకలేస్తే తినేదే చిరుతిండి. సాయంత్రం అవ్వగానే ఒక కప్పు టీతో పాటు స్నాక్స్ కూడా తినాలని నాలుక లపలపలాడుతుంటుంది. అప్పుడు మనం చిప్స్, బిస్కెట్లు లేదా పునుగులు, బజ్జీలు అంటూ ఏదో ఒకటి తింటూ ఉంటాం. కానీ ఇవి చిరుతిళ్లు అయినప్పటికీ, ఆరోగ్యానికి పెద్ద హాని చేస్తాయి. కారణం వీటిలో ఎక్కువగా నూనెలో డీప్ ఫ్రై చేసినవే. మరి ఇలాంటి సందర్భంలో మనం స్నాక్స్ తినడం మానేయాలా? అంటే అవసరమే లేదు, మీరు ఆరోగ్యకరమైన స్నాక్స్ లేదా ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండిన స్నాక్స్ ఎంచుకోవచ్చు.

ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది. మరి రెండో ఆప్షన్ ఆరోగ్యరమైన వండే విధానం మీకు తెలుసా? అందుకు వివిధ పద్ధతులు ఉన్నాయి, అందులో నూనె లేకుండా ఆవిరిలో ఉడికించడం ఒకటి. మీకు ఆవిరిలో ఉడికించే ఇడ్లీ, ధోక్లా గురించి తెలుసు. అలాంటి ఒక స్నాక్ ఐటెమ్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. సాయంత్రం వేళలో స్నాక్స్ లాగా మీరు ఉడికించిన దాల్ బాల్స్ (పప్పు ఉండలు) తినవచ్చు. ఇవి పప్పుతో చేసే ఆరోగ్యకరమైన స్నాక్స్. బరువు తగ్గాలనుకునే వారికి మంచివి. దాల్ బాల్స్ ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.

Dal Balls Recipe కోసం కావలసినవి

  • 2 కప్పులు శనగపప్పు
  • 10 పచ్చిమిర్చి
  • 1 పచ్చి కొబ్బరి
  • 1 అంగుళం అల్లం
  • 1 కొత్తిమీర కట్ట
  • 1 టీస్పూన్ పసుపు
  • 1 చిటికెడు ఇంగువ
  • 1/4 టీస్పూన్ ఉప్పు

దాల్ బాల్స్ రెసిపీ- పప్పు ఉండలు తయారు చేసే విధానం

  1. ముందుగా శనగపప్పును 1 నుంచి 2 గంటలు నీళ్లలో నానబెట్టండి, ఆ తర్వాత నీళ్లన్నీతీసేసి పొడి పేస్ట్‌లా మెత్తగా రుబ్బుకోవాలి.
  2. అనంతరం పైన పేర్కొన్న పదార్థాలలో కొత్తిమీర మినహా మిగతా పదార్థాలన్నీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు పప్పు మిశ్రమం, మసాలా మిశ్రమం రెండు కలిపేసి కొత్తిమీర తరుగుతో బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు ఈ ముద్దను చిన్నచిన్న ముద్దలుగా అరచేతిలో పిసుకుతూ గుండ్రని బంతుల లాగా తయారు చేసుకోవాలి.
  5. అనంతరం ఇడ్లీ ట్రేలలో వేసి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి.

ఆ తర్వాత బయటకు తీసి చూస్తే, దాల్ బాల్స్ రెడీ. మీరు వీటిని వెన్న లేదా కొబ్బరి చట్నీ, సాస్‌లు, కెచప్‌లు దేనితో తిన్నా రుచిగానే ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం