Vitamin D Supplements । విటమిన్ డి సప్లిమెంట్‌తో గుండెపోటుకు చెక్.. తేల్చిన తాజా రీసెర్చ్!
Vitamin D - Heart Attack: విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. తాజా పరిశోధన తేల్చిందిదే.
Vitamin D - Heart Attack: విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన వృద్ధులలో గుండెపోటుతో సహా హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. ఆస్ట్రేలియాకు చెందిన QIMR బెర్ఘోఫర్ అనే వైద్య పరిశోధన సంస్థ నిర్వహించిన D-హెల్త్ ట్రయల్ ఈ విషయాన్ని రుజువు చేసింది. ఐదు సంవత్సరాలుగా నెలవారీగా క్రమం తప్పకుండా విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్న వృద్ధులలో గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గింది. తమ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 60 నుండి 84 సంవత్సరాల మధ్య వయస్సు గల వృద్ధుల డేటాను పరిశీలించారు. ఈ మొత్తం అధ్యయనంలో సుమారు 21,000 మంది ఆస్ట్రేలియన్లు పాలుపంచుకున్నారు. ఐదేళ్ల వ్యవధిలో యాదృచ్ఛికంగా నోటి ద్వారా విటమిన్ డి సప్లిమెంట్ తీసుకున్న వారికి గుండెజబ్బుల ప్రమాదం తగ్గినట్లు పరిశోధకులు గురించారు. ఈ ట్రయల్ కు సంబంధించి ఫలితాలు BMJ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అత్యధిక మరణాలకు ప్రధాన కారణాలలో కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) కూడా ఒకటి. వయస్సు పెరిగే కొద్దీ దీర్ఘకాలిక వ్యాధులు సర్వసాధారణం అవుతున్నాయి. ఈ క్రమంలో హృదయ సంబంధ వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ప్రతీ ఏడాది-ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17.9 మిలియన్ల మంది ప్రజలు CVDలు అని పిలిచే హృదయ సంబంధ వ్యాధుల కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇందులో కరోనరీ హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ వంటివి సివిడిలకు కొన్ని ఉదాహరణలు. మరోవైపు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌లు వంటివి నేడు యువతలో సాధారణం అవుతున్నాయి, ముఖ్యంగా కోవిడ్ తదనంతర కాలంలో యువకులు, ఇదివరకు ఎలాంటి జబ్బులు లేని వ్యక్తులు కూడా ఈ గుండె జబ్బులతో ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి, గుండె జబ్బులను సరళమైన పద్ధతిలో నివారించగలిగే నిరోధక శక్తిని కనుగొన్నట్లు ఒక ఆశ కలుగుతుంది.
విటమిన్ డి అనేది కొవ్వులో కరిగేది. ఇది కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ శోషణలో పాత్ర పోషిస్తుంది. శరీర వాపులను తగ్గించడం, కణాల పెరుగుదల, నాడీ కండరాల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు, గ్లూకోజ్ జీవక్రియలోనూ విటమిన్ డి పాత్ర పోషిస్తుంది
అయితే విటమిన్ డి అనేది గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుందనే ఆలోచన కొత్తది కాదు. గతంలోనూ అనేక అధ్యయనాలు విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉన్న వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని కనుగొన్నారు.
అయితే ఆ పరిశోధనలు అంత స్పష్టంగా విటమిన్ డి గుండె జబ్బులు తగ్గించలవనీ పేర్కొనలేదు. రోజూ వ్యాయామం చేస్తూ, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినే వారిలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువ ఉంటాయి, కాబటి గుండె జబ్బులను నివారించవచ్చని పాత పరిశోధనలు తెలిపాయి. అయితే ఈ కొత్తపరిశోధన మాత్రం వ్యాయామంతో సంబంధం లేకుండా విటమిన్ డి సప్లిమెంటేషన్ గుండె జబ్బులను నివారించగలదని సూచించింది.
సంబంధిత కథనం