Foreign Like Places in India। ఇండియాలోనే ఫారెన్ టూర్.. ఈ ప్రదేశాలకు వెళ్తే విదేశాలకు వెళ్లిన వైబ్స్!
Foreign Like Places in India: ఫారెన్ టూర్ వెళ్లాలనుకున్నా మీ బడ్జెట్ సహకరించడం లేదా? భారతదేశంలోనే విదేశాలలోని ప్రదేశాలను పోలిన కొన్ని అద్భుత ప్రదేశాలు ఉన్నాయి.
భారతదేశం ఎంతో విశాలమైనది. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందినది అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఎన్నో పురాతనమైన చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి సృష్టించిన ఉత్కంఠభరితమైన సుందర దృశ్యాలు, మరెన్నో చూడదగ్గ అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. చాలా మంది జీవితంలో ఒక్కసారైనా విదేశీయాత్ర చేయాలని కోరుకుంటారు. కానీ అంతకంటే ముందు వారు భారతదేశాన్ని చుట్టిరావాలి. నమ్మశక్యంకాని ఎన్నో గొప్ప లొకేషన్‌లు ఇక్కడే ఉన్నాయి. మీరు ఈ దేశంలో ఏ మూలకు వెళ్లినా ఒక కొత్త అనుభూతిని పొందుతారు.
మీకు తెలుసా.. యూరోప్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉండే ప్రదేశాలను పోలిన కొన్ని మనోహారమైన ప్రదేశాలు ఇండియాలోనూ ఉన్నాయి, ఆ ప్రాంతాలకు వెళ్తే ఏదో విదేశంలో విహరిస్తున్నట్లే ఉంటుంది. సంస్కృతి, సంప్రదాయాలు కూడా పూర్తిగా భిన్నంగా అనిపిస్తాయి. మరి అలాంటి కొన్ని ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Indian Destinations Resemble Foreign Locations
ఈ కింద పేర్కొన్న భారతీయ ప్రదేశాలు విదేశాలలోని కొన్ని ప్రదేశాలను పోలి ఉంటాయి. విదేశీ విహారయాత్రకు బడ్జెట్ తక్కువైతే, వీటిని ఎంచుకోండి.
అండమాన్ - నికోబార్ దీవులు
క్రిస్టల్ క్లియర్ బీచ్‌ల గురించి ఆలోచించినప్పుడు మనకు మొదటగా గుర్తుకు వచ్చే గమ్యస్థానం మాల్దీవులు. ఈ చిన్న దీవులు కూడా ఒక దేశంగా ఉన్నాయి. ఒక్కసారి వెళ్లి వస్తే చాలు అనిపిస్తుంది. కానీ, అంతకంటే తక్కువ బడ్జెట్ లోనే అచ్ఛంగా అదే స్థాయి అనుభూతులను కలిగించే అండమాన్ - నికోబార్ దీవులు మనకు ఇండియాలోనే ఉన్నాయి. అండమాన్ - నికోబార్ దీవులు 500 పైగా దీవుల సమూహం. ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్, విలాసవంతమైన రిసార్ట్‌లు ఎన్నో మీకు ఆహ్వానం పలుకుతాయి.
పాండిచ్చేరి
ఫ్రాన్స్ దేశపు పట్టణాలలో విహరించాలని ఉందా? మీకు అంత బడ్జెట్ లేకపోతే పాండిచ్చేరి వెళ్లండి. పాండిచ్చేరి దక్షిణ భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. మీరు పాండిచ్చేరి వెళ్తే, ఫ్రాన్స్ వెళ్లిన అనుభూతే కలుగుతుంది. ఆహారం నుండి సంస్కృతి, వాస్తుశిల్పం, ఆతిథ్యం వరకు ప్రతిదీ ప్రత్యేకమైన ఫ్రెంచ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని భారతదేశంలోని మినీ ఫ్రాన్స్ అని పిలుస్తారు.
ఖజ్జియార్ సరస్సు
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉన్న ఖజ్జియార్ సరస్సు స్విట్జర్లాండ్‌తో అసాధారణమైన సారూప్యతను కలిగి ఉంటుంది. స్విట్జర్లాండ్ తర్వాత ఇండియాలో అలాంటి ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న శృంగార జంటలకు ఇది సరైన ప్రదేశం.
ఖజ్జియార్ సరస్సు స్విట్జర్లాండ్ భూభాగాన్ని పోలి ఉండటం వలన పర్యాటకులు ఇక్కడికి ఆకర్షితులవుతారు. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు, సహజమైన సరస్సులు, వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం మొదలైన ఆకర్షణలతో ఖజ్జియార్ ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఈ చలికాలంలోనే ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం. అక్టోబరు నుండి మార్చి వరకు ఖజ్జియార్ సందర్శించడానికి ఉత్తమ సమయంగా చెప్తారు.
గుల్మార్గ్
జమ్మూ- కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతం కూడా మినీ-స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ప్రాంతానికి వెళ్తే, స్విట్జర్లాండ్ లోని ఏదైనా పట్టణానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. చుట్టూ నిండుగా మంచుతో కప్పబడిన పర్వతాలు, ఎత్తైన క్రిస్మస్ చెట్లు, ప్రకాశవంతమైన ఆకుపచ్చ పచ్చికభూములు కచ్చితంగా మీ ఆత్మలో ఆనందాన్ని చిత్రీకరిస్తాయి. శీతాకాలపు క్రీడలకు కూడా గుల్మార్గ్ ప్రసిద్ధి. కాశ్మీర్‌లో ఎక్కువగా సందర్శించే హిల్ స్టేషన్‌లలో ఇది ఒకటి.
అలెప్పి
మీరు వెనీస్ గురించి వినే ఉంటారు, ఇటలీలో ఉన్న ఈ పట్టణంలో బ్యాక్‌వాటర్లో ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. అయితే కేరళలోని అలెప్పీని 'వెనీస్ ఆఫ్ ది ఈస్ట్' అని స్వాతంత్య్రానికి ముందు భారతదేశానికి వైస్రాయ్‌గా లార్డ్ కర్జన్ పేర్కొన్నారు. వెనీస్‌లోని ప్రశాంతమైన కాలువల మాదిరిగానే, అలెప్పీ చుట్టూ నీటి సవారీలు, ఆకలి పెంచే సీఫుడ్ , అద్భుతమైన బీచ్‌లు ఉన్నాయి. అయితే వర్షాకాలంలో భారీ వర్షాలు ఉంటాయి. ఈ సీజన్ మినహా మిగతా రోజుల్లో ఇక్కడకు వెళ్తే ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇక, దక్షిణ భారతదేశంలోనే ఉన్న గోవా కూడా మీకు అక్కడక్కడా వైబ్‌లను అందిస్తుంది.
సంబంధిత కథనం