Valentine's Day Poems । ఈ కవితలు ప్రేమతో పూసిన ఆణిముత్యాలు.. మీ ప్రియమైన వారితో పంచుకోండి, ప్రేమను పెంచుకోండి! -vintage love poems to share with your special someone to win their hearts in this valentine s season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vintage Love Poems To Share With Your Special Someone To Win Their Hearts In This Valentine's Season

Valentine's Day Poems । ఈ కవితలు ప్రేమతో పూసిన ఆణిముత్యాలు.. మీ ప్రియమైన వారితో పంచుకోండి, ప్రేమను పెంచుకోండి!

Manda Vikas HT Telugu
Feb 07, 2023 04:48 PM IST

Valentine's Day Poems: నిన్నటి తరం ప్రేమలు, ప్రేమకథలు, ప్రేమ వ్యధలు అజరామరం. అలాంటి రోజులను గుర్తుకుతెచ్చేలా, ప్రేమికుల రోజు సందర్భంగా కొన్ని సరదా ప్రేమ కవితలను మీ ముందు ఉంచుతున్నాం.

Valentine's Day Poems
Valentine's Day Poems (iStock)

ప్రేమికుల రోజు వచ్చేస్తోంది. మీరు ప్రేమించిన వారికి మీ ప్రేమను వ్యక్తీకరించే ఒక అద్భుత సందర్భం ఇది. మనలో ఉన్న ప్రేమను బయటకు చెప్పినప్పుడే మన ప్రేమ గురించి వారికి తెలుస్తుంది. అయితే ప్రేమను వ్యక్తపరచటం కూడా ఒక కళ. నిజానికి ప్రేమిచడం రాకపోయినా, ప్రేమను వ్యక్తపరచటమే ఒక పెద్ద టాస్క్. మీ ప్రేమ విషయాన్ని చెబితే వారు ఏమనుకుంటారో, మిమ్మల్ని వారు అంగీకరిస్తారో లేదో అన్న భయం ఉంటుంది.

ఒకప్పుడు ప్రేమను చెప్పటానికి ప్రేమలేఖలు రాసేవారు, లేదా తమ ప్రేమను కవితారూపంలో తెలిపేవారు, ఎర్రని ఒక గులాబీ పువ్వును ఇచ్చేవారు. కానీ ఇప్పుడంతా డిజిటల్ యుగం, వాట్సాప్‌లో మెసేజ్‌లు, ఇన్‌స్టా‌గ్రామ్‌లో గ్రీటింగ్‌లు, ఖరీదైన బహుమతులు, ఆన్‌లైన్‌లో డేటింగ్, మీటింగ్‌లు, ఆ తర్వాత బ్రేకప్‌లు ఇలా అన్నీ ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయి. కానీ అప్పటి రోజులే ప్రేమకు స్వర్ణ యుగం అని చెప్పవచ్చు. నిజమైన ప్రేమకు ఖరీదైన బహుమతులు అవసరం లేదు, మంచి హృదయం చాలు.

Vintage Love Poems For Valentine's Day- ప్రేమికుల రోజు ప్రేమ కవితలు

మీకు పాత రోజులను గుర్తు చేసేలా కొన్ని ప్రేమ కవితలను ఇక్కడ అందిస్తున్నాం. ఇవి మీకు ఇష్టమైన వారికి చెప్పి, మీ ప్రేమను వ్యక్తపరచండి. వారి ప్రేమను గెలుపొందండి.

ముఖ్య గమనిక, ఈ ప్రేమ కవితలను నిజంగా మీరు ప్రేమించే ఆ ఒక్కరికి మాత్రమే చెప్పండి, ఎక్కువ మందికి చెబితే వారంతా కూడా మీ ప్రేమలో పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాం.

1. చెలి.. ఓ చెలి.. ఓహో చెలి.. అబ్బా చెలి

నిన్ను చూడగానే నాలో పుట్టింది చలి

పులిలాంటి నన్ను చేశావు నువ్వు పిల్లి

ఏ నాటికైనా నీతోనే నా పెళ్లి

నువు కాదంటే చచ్చి పుడతాను మళ్లీ మళ్లీ

2. నీ చిరునవ్వు కొడుతుంది నా గుండెలో గంట

నువ్వే నేను కోరుకున్న కలల రాణివంట

నువ్వు ఇంకొకరితో మాట్లాడితే మండుతుంది నాలో మంట

మనం ఇద్దరం ఏకమైతే మనదే అందాల జంట

నువ్వు ఒప్పుకుంటే జన్మజన్మలకు నీతోడుంటా

నువు కాదంటే తింటా పంటా, ఇక ఉంటా!

3. నువ్వే నా ప్రాణం అని నా మనసు చెబుతోంది

ఎంతమంది అందెగత్తెలున్నా నామది నిన్నే కోరుతోంది

నాలోని నేను నీతోనే జీవితం అంటోంది

రేపటి అందమైన మన ప్రయాణానికి నా హృదయం బాటలు పరుస్తోంది

కలలో నిజంలా.. నిజంలో కలలా ఉంది నా పరిస్థితి

4. ఏమిటో ఇది, నిన్ను చూసిన క్షణం నుంచి నా జీవితం కొత్తగా ఉంది

నిరంతరం నీ ఆలోచనలతో నన్ను మరిచిపోతున్నాను

నువ్వెవరో తెలియకపోయినా, నువ్వే నా ఆత్మీయనేస్తం అనుకుంటున్నాను

నీతో కలిసి ఉన్నట్లు, నీతో ఊసులాడుతున్నట్లు వింతవింతగా ఉంటుంది

ఇది ప్రేమేనా.. లేక నా పిచ్చితనమా.. అది నీ సమ్మతంతోనే నాకు నమ్మకం కలుగుతుంది.

5. నారీ నారీ నువ్వే నా ప్యారీ..

నీ నవ్వే గలగల పారే గోదావరి

కొంచెం అయినా నీ ప్రేమను ఇయ్యవా ఓ పిసినారి

నీ చెమట చుక్కలే నాకు అత్తరులా చేయవా పిచికారి

అందరిలో నిన్నే కోరుకుంటున్నా ఏరి కోరి

నీకు ఇలాగే అనిపిస్తుందా చెప్పవా మరి..

ఈ కవితలు మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు, అవును నిజమే సరికొత్తవి. మీరు ఇది వరకు ఎప్పుడూ, ఎక్కడా కనివినీ ఎరుగనివి. ప్రేమ పూసిన ఈ ఆణిముత్యాలను విచ్చలవిడిగా వాడుకోండి, మీ ప్రియమైన వారిని ఆనందింపజేయండి, వారి మనసును గెలవండి. ఇందులో ఏ కవిత నచ్చిందో కూడా చెప్పండి.. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం