World Poetry Day | నేను కవిని కానన్న వారిని కత్తితో పొడుస్తా!
కాదేది కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ అన్నారు. ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల ఏదైనా ఒక కవికి కవితా వస్తువే. ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలుగులో కవులు, కవిత్వాలపై ఒక చిన్న పరిచయం.
కాదేది కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ అన్నారు. ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల ఏదైనా ఒక కవికి కవితా వస్తువే. ప్రియురాలికి మనసులో ప్రేమను వ్యక్తీకరించాలన్నా, అందాన్ని మరింత అందంగా వర్ణించాలన్నా, హస్యాన్ని వ్యంగ్యంతో జోడించాలన్నా, పాలకులను పొగడాలన్నా, ప్రజల్లో చైతన్యం రగిలించాలన్నా, ప్రభుత్వాలను కూలదోయాలన్నా కవిత్వం ఎంతో శక్తివంతంగా ప్రభావం చూపుతుంది.
ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం. అంతరించిపోతున్న భాషలు వాటి యాసలు, అందులోని వైవిధ్యాన్ని గుర్తించి కవితారూపంలో ఆ యాసభాషలకు పునర్వైభవం కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ప్రతి ఏడాది మార్చి 21న 'ప్రపంచ కవితా దినోత్సవం' గా పాటిస్తున్నారు.
భాష యాదైనా, యాస ఏదైనా దానికి దక్కాల్సిన గౌరవం దక్కాలి. ఒకరి యాసభాషలో రాసిన కవిత్వం, సాహిత్యపరమైన రచనలు ప్రజలను ఒక తాటికి చేరుస్తుంది. తమదైన శైలిలో కవిత్వాలను రాయడం, చదవడం, ప్రచురించడం, బోధించడం లాంటివి చేస్తే వారి యాసభాష, సంస్కృతి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. కవిత్వం రాయడాన్ని ప్రోత్సహిస్తూ ఈ రకంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కవితోద్యమాలకు గుర్తింపు, ప్రేరణ అందించడం లక్ష్యంగా UNESCO ప్రపంచ కవితా దినోత్సవం నిర్వహిస్తోంది.
తెలుగు కవులు- కవిత్వాలు
తెలుగులో ఎంతో మంది కవులు ఎన్నో గొప్పగొప్ప కవితారచనలు చేశారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా ఎనిమిది మంది కవులు ఉండేవారని మనం చరిత్రలో చదివాం. తెలుగు భాషకు కవిత్రయంగా వేమన, తిక్కన, గురజాడ ఎంతో ప్రసిద్ధి. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది కవులు తమ కవిత్వాలతో ప్రజలను రంజిపజేశారు, చైతన్యవంతులను చేశారు. ప్రజల్లో స్ఫూర్థిప్రదాతలుగా నిలిచారు. మచ్చుకు ఒక కొంతమంది కవుల్ని వారి కవిత్వాలను గురించి ఇక్కడ చెప్పుకుందాం.
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భునఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను-- శ్రీశ్రీ
--
బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా
పుడమి కదిలింది చరణాలుగా
జడిమ కదలింది హరిణాలుగా
నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది
నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది
వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును
ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక్క హృదయాన్ని జయిస్తుందా... సినారె
--
అథితివోలే ఉండి ఉండి
అవని విడిచి వెళ్తున్నాను
పల్లెపట్టణంబులనక పల్లేరై తిరిగినాను
తొలగి తోవెవ్వడిచ్చు తోసుకొని పోవలయు
బతుకు పోరాటము పడకు ఆరాటము.. కాళోజీ
ఇలాంటి అభ్యుదయ భావాలు, గొప్పగొప్ప వారు మాత్రమే రాసేవి కవితలు కాదు. మనలో చాలా మంది కూడా కవిత్వాలు రాసేవారుంటారు. కానీ అవి ఇలా ఉంటాయి.
మా ఇంట్లో చేశారు పప్పు
మా నాన్న చేస్తారు అప్పు
కాలికి వేస్తారు చెప్పు
ఈ కవిత ఎలా ఉందో చెప్పు;;
చెలి.. ఓ చెలీ.. ఓహో చెలి.. అబ్బా చెలి
నిన్ను చూడగానే నాలో కలిగింది చలి
నాలో అవుతుంది గిలిగిలి;;
నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తా
నేను రచయితను కానన్న వాడిని రాయెత్తి కొడతా
నోటికి మాట నెత్తికి రీటా కాళ్లకు బాటా నాకిష్టం సపోట;;
కవులందరికీ కవితా దినోత్సవ శుభాకాంక్షలు!
సంబంధిత కథనం