Valentine's Week Road Trips। ప్రేమికుల రోజున లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకుంటున్నారా? బెస్ట్ రోడ్ వేలు ఇవే!
Valentine's Week Romantic Road Trips: మీ ప్రియమైన వ్యక్తికి ట్రావెల్ చేయడం అంటే ఇష్టమా? అయితే మరింత కనెక్ట్ కావడానికి, వారిని ఈ ప్రేమికుల రోజున సర్ప్రైజ్ చేయడానికి ఏదైనా రోడ్ ట్రిప్ ప్లాన్ చేయండి. బెస్ట్ కొన్ని ఎంపికలు ఇక్కడ చూడండి.
లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టపడని అమ్మాయి ఉండదు. చాలా మంది తమ స్నేహితులతో కలిసి లేదా తమ ప్రియమైన వారిని వెంట పెట్టుకొని సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్తుండటం మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రేమికుల వారం (Valentine's Week 2023) మొదలవుతుంది. మరి మీకు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని లేదా జీవిత భాగస్వామికి ఈ ప్రేమికుల రోజున (Valentine's Day 2023) గొప్ప బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారా? మీరు ఇద్దరూ కలిసి అద్భుతమైన క్షణాలను ఆస్వాదించడానికి కొన్ని రొమాంటిక్ రోడ్ ట్రిప్‌ల గురించి తెలియజేస్తున్నాం. ఈ రోడ్ ట్రిప్ మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
Valentine's Week Romantic Road Trips- ప్రేమికుల రోజు కోసం రొమాంటిక్ రోడ్ ట్రిప్‌లు
మీ ప్రేమికుల రోజును మరింత ప్రత్యేకం చేయడానికి, సుందరమైన దృశ్యాలతో నిండి ఉన్న భారతదేశంలోని 5 అద్భుతమైన రోడ్‌వేలు ఇక్కడ చూడండి.
1. బెంగళూరు నుండి బందీపూర్ ఫారెస్ట్
బెంగుళూరు నుండి బండిపూర్ ఫారెస్ట్‌కు 217 కిలోమీటర్ల దూరం కలిగిన ఈ రోడ్ ట్రిప్ మీకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. మార్గం గుండా ప్రశాంతమైన పచ్చని చెట్లు, పకృతి దృశ్యాలు వీక్షించడానికి వీలు కలుగుతుంది. అడవుల గుండా వెళ్తున్నప్పుడు కొని అరుదైన వన్యప్రాణులను చూడవచ్చు. కబిని నదిలో బోటు షికారు చేయడం, మోయార్ కాన్యన్ సందర్శన ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
2. ముంబై టు కాషిద్
అటు గోవా ఇటు అలీబాగ్‌ల వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను కలిపే ఈ మార్గం రోడ్ ట్రిప్‌లకు అద్భుతమైనది. మీరు ముంబై నుంచి ఈ అందమైన బీచ్ టౌన్‌కి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది, ప్రయాణ దూరం 129 కిమీ. మీ ప్రత్యేక వ్యక్తి జతగా చేసే ప్రయాణంలో అసలు సమయమే తెలియదు. ఈ డ్రైవ్ మీకు పూర్తి పచ్చదనంతో నిండిన భారతదేశంలోని కొంకణ్ ప్రాంతం సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. కాషిద్ పట్టణంలో నిర్మలమైన బీచ్ ఉంది, ఇక్కడ మీరు వాటర్‌స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు లేదా బీచ్‌లో సరదాగా కూర్చొని అలలను వీక్షించవచ్చు. తీరంవెంబడి గుర్రపు స్వారీలు కూడా చేయవచ్చు.
3. చెన్నై నుండి మున్నార్
గంభీరమైన కొండలు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి దృశ్యాలు, పెద్ద వృక్షాలు, తేయాకు తోటలు, సహజమైన సరస్సులు, గలగల శబ్దం చేసే జలపాతాలు ఇవన్నీ చెన్నై నుండి మున్నార్‌కు రోడ్డు ప్రయాణం చేయడం ద్వారా ఆస్వాదించవచ్చు. ఈ యాత్ర శృంగారభరితంగా, అద్భుతంగా ఉంటుంది. చెన్నై నుండి మున్నార్ వరకు దాదాపు 592 కి.మీ. ఈ మార్గంలో మీరు లక్కం జలపాతాలు, మట్టుపెట్టి ఆనకట్ట, చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం, చినార్ వాచ్ టవర్ మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు.
4. సిమ్లా నుండి మనాలి
హిమాలయాల మంత్రముగ్ధమైన వీక్షణతో సిమ్లా నుండి మనాలి వరకు ఈ రోడ్ ట్రిప్ ఎంతో ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. అత్యంత సుందరమైన, నిర్మలమైన రహదారి ప్రయాణాలలో ఇది ఒకటి. ప్రయాణ దూరం 220 కిలోమీటర్లు. మీ ప్రయాణంలో చల్లని గాలులు మిమ్మల్ని తాకుతుంటాయి, మార్గం గుండా వేడివేడి రుచులు స్వాగతం పలుకుతుంటాయి. ఎక్కడైనా కాసేపు ఆగి రిఫ్రెష్ కావచ్చు. చల్లని బియాస్ నది వద్ద ఆడలాడటం మరిచిపోవద్దు.
5. జైపూర్ నుండి జైసల్మేర్
ఒక వైపు ఎత్తైన రాజ భవనాలు, మరోవైపు ఎడారి.. ఇలాంటి రాయల్ టూర్ చేయాలనుకుంటే జైపూర్ నుండి జైసల్మేర్ వరకు 500 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయండి. మీరు మీ ప్రయాణంలో జైసల్మేర్ కోట, గడిసర్ సరస్సు, తనోత్ మాతా దేవాలయాన్ని చూడవచ్చు. రాజస్థాన్ గ్రామీణ జీవితాన్ని, స్థానిక సంప్రదాయాలను తెలుసుకోవచ్చు. ప్రసిద్ధ రాజస్థానీ వంటకాలను రుచిచూడవచ్చు.
సంబంధిత కథనం