Varalakshmi pooja decor: మామిడాకులు, పూలతో వరలక్ష్మీ పూజకు బ్యాక్‌డ్రాప్, రంగోలీని రెడీ చేసేయండి
Varalakshmi pooja decor: వరలక్ష్మి వ్రతం రోజున ఇంటిని అలంకరించడంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందే. దానికోసం ఖరీదైన వస్తువులేమీ అక్కర్లేదు. కాస్త సృజనాత్మకత జోడిస్తే మామిడాకులు, గులాబీలు, బంతిపూలతో మంచి డెకరేషన్ చేసేయొచ్చు. విగ్రహం వెనకాల, రంగోలీ కోసం మంచి అలంకరణ ఐడియాలు చూసేయండి.
వరలక్ష్మీ దేవి వ్రతంలో అలంకరణకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి చీరకట్టు, ఆభరణాల నుంచి కలశం వరకు ప్రతిదీ ప్రత్యేకంగా అలంకరించాల్సిందే. వీటన్నింటికన్నా ముఖ్యమైంది అమ్మవారి బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్. సాధారణంగా ఏదైనా రెడీమేడ్ బ్యాక్ డ్రాప్ పెట్టేసి అలంకరించుకుంటారు. కానీ మీ చేత్తో ప్రత్యేకంగా, సృజనాత్మకంగా డెకరేషన్ చేయాలనుకుంటే కొన్ని సింపుల్ మార్గాలున్నాయి.
మామిడాకులతో:
పండగంటే ఇంట్లో మామిడాకుల తోరణం లేకుండా పూర్తవ్వదు. అయితే ఆ మామిడాకులను తోరణానికి పరిమితం చేయకండి. దాంతో వివిధ ఆకారాలు కట్ చేసి డెకరేట్ చేయొచ్చు. వరమహాలక్ష్మి విగ్రహం వెనకాల ఒక ప్లెయిన్ దుపట్టా ఒకటి వేళాడతీయండి. దానిమీద అక్కడక్కడా పైన ఫొటోలో మాదిరిగా మామిడాకులు, పూలు కలిపి చిన్న హ్యాంగింగ్స్ లాగా తయారు చేయాలి. వాటిని అక్కడక్కడా పిన్ పంచ్ చేస్తే సరిపోతుంది. అంతే.. చాలా సింపుల్‌గా ఉండే బ్యాక్‌డ్రాప్ రెడీ అవుతుంది.
హ్యాంగింగ్స్ లాగా:
మామిడాకులను ముందు ఒక చిన్న అట్ట ముక్క మీద గుండ్రంగా పిన్ చేయండి. మధ్యలో బంతిపూల దండను ఉంచి కట్టేయండి. లేదా డబుల్ ప్లాస్టర్ సాయంతో పూలు వరసగా అతికించండి. అలా ఐదారు తయారు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు బంతిపూల దండను కుచ్చుకుని దానికి చివర్లో ఈ మామిడాలకులతో చేసిన ఆకృతిని ఉంచండి. వీటిని వేళాడదీస్తే ఎంత మంచి లుక్ వస్తుందో చూడండి. గోడకు వేలాడదీసినా సరిపోతుంది.
ఇంటి గుమ్మం ముందు:
మీకు రంగోలీ వేయడం రాకపోతే పూలు, ఆకులతో అదిరిపోయే డిజైన్లు వేసేయొచ్చు. చాలా సింపుల్ గా బంతి పూలు, లేదా గులాబీలతో ఒక ఆకారం గీయండి. చిన్న పూవు లాగా గీసి ఆ రెక్కల్లో మామిడికాలను చిదిమి వేసి రంగుల ముగ్గు లాగా నింపండి. చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది. సింపుల్ గా వేయొచ్చు కూడా.
తమలపాకులతో:
లక్ష్మీదేవి వెనకాల ఒక ప్లెయిన్ దుపట్టా ఒకటి వేలాడదీయండి. దాని చుట్టూరా తమలపాకులు అతికించేయండి. మంచి రంగు దుపట్టా ఎంచుకుంటే చాలు. ఆకుల రంగు హైలైట్ అయ్యేలా ఉండాలీ ఆ డిజైన్. మధ్య మధ్యలో మామిడాకులతో చేసి అలంకరణలు అతికించారంటే మంచి లుక్ వస్తుంది. అవకాశం ఉంటే లైట్ల వరసను పెట్టేయండి.
విగ్రహం వెనకాలే కాదూ.. పక్కన, ముందు కూడా మంచి డెకరేషన్ చేయొచ్చు. చూడ్డానికి లుక్ బాగుంటుంది. దానికోసం ఒక తాంబాలంలో నీళ్లో పోయండి. మీద ఆకులు, పూలు పెట్టి మంచి ఆకృతి లాగా రెడీ చేయొచ్చు. లేదంటే తాంబాలంలో నీళ్లు పోసి మీద అడ్డుగా సన్నటి పుల్లలు పేర్చండి. దాని మీద ఆకులు పేరిస్తే చాలా సులువుగా ఆగుతాయి. నీళ్లలో మునిగిపోవు. దాంట్లో పూరేకులు, ఆకులతో డెకరేషన్ చేసేయండి.