World food day 2024: నేడే ప్రపంచ ఆహార దినోత్సవం, భూమిపై ఉన్న మనుషుల్లో ఎన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారో తెలుసా?-today is world food day do you know how many billions of people on earth are starving ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Food Day 2024: నేడే ప్రపంచ ఆహార దినోత్సవం, భూమిపై ఉన్న మనుషుల్లో ఎన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారో తెలుసా?

World food day 2024: నేడే ప్రపంచ ఆహార దినోత్సవం, భూమిపై ఉన్న మనుషుల్లో ఎన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారో తెలుసా?

Haritha Chappa HT Telugu
Oct 16, 2024 11:19 AM IST

World food day 2024: ఒక మనిషి జీవించాలంటే ఆహారమే ముఖ్యం. కానీ ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మందికి ఆహారమే లభించడం లేదు. అందుకే ప్రతి ఏటా మనం ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచ ఆహార దినోత్సవం (Bhutnath Painting Academy)

ఒక మనిషి జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆహారం. ఆ తర్వాతే దుస్తులు, నివాసం వంటివి. ఆహారం ప్రాముఖ్యతను తెలియజేసేందుకే ప్రతి ఏటా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆహార భద్రత ఎంత ముఖ్యమో ప్రతి మనిషికి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో పెరుగుతున్న జనాభా, తరుగుతున్న ఆహార నిల్వలు... ఆకలి చావులను పెంచుతోంది. ఏ ఒక్కరూ కూడా ఆకలి కారణంగా మరణించకుండా ఉండాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవ ముఖ్య ఉద్దేశం.

ఎప్పుడు మొదలైంది?

ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఒక్కొక్క దేశం మెల్లగా ఈ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ప్రారంభించింది. ఈ దినోత్సవం సందర్భంగా ఆహార భద్రత వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ప్రతి మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందాలన్నదే ఈ దినోత్సవ ప్రధాన ఆశయం. ప్రజల్లో ఆహారం గురించి అవగాహన పెంచాలని కూడా ఈ దినోత్సవానికి పునాది పడేలా చేసింది.

భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి ఆహారం చాలా ముఖ్యం. కొన్నిచోట్ల ఆహార కొరత ఏర్పడుతుంటే, మరికొన్ని చోట్ల ఆహారం వృధా అవుతుంది. ఆహారం వృధా చేసేవారు ప్రపంచంలో ఉన్న ఆహార కొరతను అర్థం చేసుకొని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. ఆహారం అనేది శరీరానికి శక్తిని అందిస్తుంది. శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. ఆహార కొరత వల్ల ఈ మనిషి ఎక్కువ కాలం జీవించలేడు.

ఐక్యరాజ్యసమితి చెబుతున్న ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మందికి ఆహార కొరత ఏర్పడింది. వారిలో 78 కోట్ల మందికి పైగా ఆకలితో అలమటిస్తూ ఉంటే, 14 కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపం వల్ల ఎదుగుదల లోపించింది.

కొన్ని దేశాల్లో ఆహారం అధికంగా వృధా అవుతుంటే, పశ్చిమాసియా, ఆఫ్రికా, కరీబియన్ దేశాల్లో నివసిస్తున్న 20 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కూడా రెండు దేశాల్లో చాలాచోట్ల ఆహార కొరతను ఏర్పడేలా చేసింది. యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారి రోగాలు, ప్రకృతి విలయాలు వంటివి ఆహార కొరతను పెంచుతాయి. అలాగే ధనవంతులు ఆహారాన్ని అధికంగా వృధా చేయడమనేది కూడా మరొకచోట పేదవారి కంచంలో ఆహారాన్ని లేకుండా చేస్తోంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి అడుగులు వేయాలి.

ప్రస్తుతం ప్రపంచంలో ఆహార కొరత వల్ల పోషకాహారంతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. 2030లో 60 కోట్ల మందికి పోషకాహార లోపం ఉండే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.

ధనవంతులు ఆహారాన్ని వృధా చేయకుండా పేదవారికి పంచడం ద్వారా కొంతమేరకు ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్యను తగ్గించవచ్చు. మీరు చేసే ఆహార వృధా... మరొక కుటుంబాన్ని ఆకలి చావులకు దగ్గర చేస్తుందని అర్థం చేసుకోండి. ఆహారాన్ని జాగ్రత్తగా వినియోగించండి. ప్రపంచంలో ఆహార కొరత రాకుండా మీ వంతు సాయాన్ని చేయండి.

Whats_app_banner